ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీని కలువనున్నారు. ఇటీవల శాసనసభ ఆమోదించిన బీసి-ఈ బిల్లు (ముస్లిం రిజర్వేషన్ బిల్లు)కు కేంద్రం ఆమోదించాలని ప్రధానిని కోరబోతున్నారు. విభజన చట్టంలో హామీ ప్రకారం రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల పెంచాలని కోరబోతున్నారు. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించడం, హైకోర్టు విభజన, ఎస్సీ వర్గీకరణ, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలు తదితర అంశాల గురించి ప్రధాని మోడీతో చర్చించబోతున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ఒక్కో జిల్లాకు కేంద్రం ఏటా రూ.50 కోట్లు ఇస్తోంది. ఇప్పుడు జిల్లాల పునర్విభజన జరిగి వాటి సంఖ్య పెరిగినందున తదనుగుణంగా నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ప్రధానిని కోరవచ్చని తెలుస్తోంది. ఇంకా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, రెండు తెలుగు రాష్ట్రాల మద్య నెలకొన్న వివాదాలు, సమస్యలను కూడా కేసీఆర్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారం కోసం కేంద్రం చొరవ తీసుకోవాలని కోరబోతున్నట్లు సమాచారం.
అయితే కేసీఆర్ లేవనెత్తబోయే అంశాలు, సమస్యలన్నిటికీ ఏవో రకమైన చిక్కుముడులున్నందున కేసీఆర్ వినతులను ప్రధాని నరేంద్ర మోడీ చెవికెక్కించుకొంటారో లేదో? ముఖ్యంగా ముస్లిం రిజర్వేషన్లు కల్పించడాన్ని భాజపా వ్యతిరేకిస్తున్నప్పుడు, ఆ బిల్లు గురించి కేసీఆర్ వినతులను మోడీ పట్టించుకొంటారనుకోలేము. కానీ ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబందించిన కొన్ని సమస్యలైన పరిష్కారం అయితే సంతోషమే.