దేశమంతటా ఒకేసారి ఎన్నికలు?

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆదివారం డిల్లీలో జరిగిన 3వ నీతి ఆయోగ్ సమావేశానికి డిల్లీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రివాల్, మమతా బెనర్జీ తప్ప దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, జూలై 1 నుంచి అన్ని రాష్ట్రాలలో జి.ఎస్.టి.పన్ను విధానాన్ని అమలుచేయడంపై చర్చించారు.

ఇంతవరకు ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండే ఆర్ధిక సంవత్సరాన్ని ఇక నుంచి జనవరి 1 నుంచి డిశంబర్ 31కి మార్పు చేయడానికి అవసరమైన విధివిధానాలపై చర్చ జరపాలని నిశ్చయించారు. దేశ సమగ్రాభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం రూపొందించిన 3,7,15 సం.ల కాలపరిమితులకు ప్రణాళికలను సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులకు అందజేసి వాటికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. 

కేంద్రపై రాష్ట్రాలు ఆధారపడే పరిస్థితి కాకుండా అన్ని రాష్ట్రాలు స్వయంసంవృద్ధి సాధించాలని, అందుకోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొంటూ ముందుకు సాగుదామని అన్నారు. దేశంలో మౌలికవసతులను తగినంతగా అభివృద్ధి వేయకపోవడం వలననే దేశంలో అభివృద్ధి నత్తనడకలు నడుస్తోందని కనుక అన్ని రాష్ట్రాలు మౌలికవసతుల కల్పనపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు.