తమిళ సాంబార్ గుమగుమలు

దినకరన్ ని అందుకే డిల్లీకి పిలిపించారా?

అన్నాడిఎంకె పార్టీ ఎన్నికల చిహ్నం దక్కించుకోవడం కోసం కేంద్ర ఎన్నికల కమీషన్ కు రూ.50 కోట్లు లంచం ఇవ్వాలని ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ మేనల్లుడు దినకరన్ కు డిల్లీ పోలీసులు మొన్న సమన్లు జారీ చేయడంతో ఆయన శనివారం ఉదయం డిల్లీకి బయలుదేరారు. తమిళనాడు రాజకీయాలలో పట్టు పెంచుకోవాలని తహతహలాడుతున్న కేంద్రప్రభుత్వం, పన్నీర్ సెల్వం వెనుక నిలబడి చక్రం తిప్పుతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాను పళనిస్వామితో చేతులు కలపాలంటే అన్నాడిఎంకె పార్టీ ఎన్డీయే కూటమిలో చేరాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేయడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కనుక శశికళను బెంగళూరు జైలుకి పంపించిన కేంద్రం, డిల్లీ వస్తున్న దినకరన్ ను తీహార్ జైలుకు పంపించినా ఆ ఆశ్చర్యం లేదు. అదే జరిగితే పళనిస్వామి దిగిరాక తప్పదు. 

పళనిస్వామి కూడా డిల్లీకి..దేనికో?

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నేడు డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కలువబోతున్నారు. పన్నీర్ సెల్వం వర్గంతో చర్చలు జరుగుతున్న సమయంలో అయన హటాత్తుగా డిల్లీ వెళ్ళడం వెనుక ఏదో బలమైన కారణమే ఉండాలి. ఆయన డిల్లీ పర్యటన ఫలితం తమిళరాజకీయాలను మలుపు తిప్పినా ఆశ్చర్యం లేదు.  

ఓపిస్-ఈపిస్ కమిటీల భేటీకి ముహూర్తం ఖరారు

పన్నీర్ సెల్వం (ఓపిస్), పళనిస్వామి (ఈపిస్) వర్గాల మద్య చర్చలు జరిపేందుకు ఏర్పాటు చేసుకొన్న కమిటీలు సోమవారం చెన్నైలో సమావేశం కాబోతున్నాయి. 

జయ మేనకోడలు దీపపై పోలీస్ కేసు!

ఇక మరో విచిత్ర పరిణామం ఏమిటంటే, జయలలిత మేనకోడలు దీప “ఎంజీఆర్‌ అమ్మ దీపా పేరవై” అనే స్వంతకుంపటి పెట్టుకొన్న సంగతి తెలిసిందే. ఆమెపై కూడా నిన్న మాంబళం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు అయ్యింది. తానే జయలలిత అసలు వారసురాలినని, తానే అధికారంలోకి రాబోతున్నానని చెప్పి ఆమె అందరినీ నమ్మించి రూ.20 కోట్లు పైగా వసూలు చేసిందని, పార్టీ సభ్యత్వ దరఖాస్తుల పేరిట బారీగా డబ్బు దండుకొన్నారని ఆరోపిస్తూ దీపా జయకుమార్ పై వచ్చిన పిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.   

ఎవరి కుంపటి వారిదే! 

భార్య దీపతో విభేదించిన మాధవన్ కూడా ఎం.జె.ఎం.డి.కె. అనే మరో కొత్త పార్టీని స్థాపించారు.