తెరాస ఏర్పడి 16 ఏళ్ళు..అధికారంలోకి వచ్చి దాదాపు 3 ఏళ్ళు అవుతోంది. ఈ సందర్భంగా నేడు ఆ పార్టీ హైదరాబాద్ శివార్లలో కొంపల్లిలో ప్లీనరీ సమావేశం నిర్వహించుకోబోతోంది. దీనికి తెరాస మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు, రాష్ట్రం నలుమూలల నుంచి 10,000 మంది కార్యకర్తలు హాజరుకాబోతున్నారు. తదనుగుణంగానే బారీగా ఏర్పాట్లు చేసుకొంది.
మొదట తెలంగాణా భవన్ లో తెరాస అధ్యక్షుడుగా కేసీఆర్ మళ్ళీ ఎంపికయినట్లు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన నాయిని నరసింహారెడ్డి ప్రకటిస్తారు. అధ్యక్ష పదవికి కేసీఆర్ తరపున 11 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. సహజంగానే వేరెవరు నామినేషన్ వేయలేదు. కనుక కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటిస్తారు.
ఆ తరువాత కేసీఆర్ తన మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో కలిసి కొంపల్లికి చేరుకొని తెరాస పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం తెలంగాణా తల్లి, అమరవీరుల స్థూపానికి పుష్పాలు సమర్పిస్తారు. ఆ తరువాత కేసీఆర్ అధ్యక్షుడుగా ఎన్నికైనట్లు నాయిని ప్రకటిస్తారు. తరువాత కేసీఆర్ అభినందన కార్యక్రమం ఉంటుంది.
తరువాత అందరూ రెండునిమిషాలు మౌనం పాటించి అమరవీరులకు శ్రద్దాంజలి ఘటిస్తారు. ఆ తరువాత శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీకి వచ్చిన వారిని ఉద్దేశ్యించి అధ్యక్షోపన్యాసం చేస్తారు.
ఈ ప్లీనరీ సమావేశాలలో మొత్తం 7 తీర్మానాలను ఆమోదిస్తారు. అవి: 1. సంక్షేమంలో స్వర్ణయుగం 2. నీటిపారుదల, వ్యవసాయరంగాల్లో నూతన అధ్యాయం. 3. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠం.4. వృత్తి పనులకు ప్రోత్సాహం, 5. విద్యుత్ రంగంలో విజయం, 6. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఐటీ రంగ అభివృద్ధి, 7. వినూత్న విధానాలు-ప్రగతి కాముక పథకాలు, సామాజిక రుగ్మతలపై సమరం
వాటిని ఆమోదించిన తరువాత పార్టీ నియామావళిలో కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తారు. చివరిగా సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంతో ప్లీనరీ ముగుస్తుంది.