అమిత్ షాకు తెరాస వార్నింగ్

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తెరాస వార్నింగ్ ఇచ్చింది. ఆయన ఈ నెల 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు తెలంగాణాలో పర్యటించబోతున్నారు. ఆ పర్యటనలో ప్రధానంగా హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంపైనే దృష్టి కేంద్రీకరించబోతున్నారు. ప్రస్తుతం మజ్లీస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికలలో ఎలాగైనా భాజపాయే దక్కించుకోవాలనే లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు పాతబస్తీలో కూడా పర్యటించబోతున్నారు. ఆ సందర్భంగా ఆయన మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినట్లయితే చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవలసి వస్తుందని డిల్లీలోని తెలంగాణా ప్రభుత్వం అధికార ప్రతినిధి ఎస్. వేణుగోపాలాచారి హెచ్చరించారు. 

“ఉత్తరప్రదేశ్ ఫార్ములనే తెలంగాణా రాష్ట్రంలో కూడా అమలుచేసి అధికారంలోకి రావాలని భాజపా కలలు కంటోంది. అయితే ఉత్తరప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు పూర్తి భిన్నమైనవాణి భాజపా గ్రహించినట్లు లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం, శాంతిభద్రతలు నెలకొని ఉన్నాయి. ఆయన నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. కనుక రాష్ట్ర ప్రజలందరూ ఆయన వెంటే ఉన్నారు. రాష్ట్రంలో హిందూ, ముస్లింల మద్య చిచ్చుపెట్టి భాజపా అధికారంలోకి రావాలనుకొంటే దానిని మేము అడ్డుకొంటాము. అమిత్ షా పాతబస్తీ పర్యటనలో మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే చట్టప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవలసివస్తుంది,” అని వేణుగోపాలాచారి హెచ్చరించారు.