ఆ బిల్లు మృత శిశువు వంటిది: జైపాల్

చిరకాలం కేంద్రమంత్రిగా చేసిన జైపాల్ రెడ్డికి అపార రాజకీయ, పరిపాలనానుభావం, చట్టాల గురించి పూర్తి అవగాహన ఉంది. ఆయన ముస్లింలకు 12 శాతం  రిజర్వేషన్ కల్పిస్తూ తెరాస సర్కార్ ఆమోదించిన బిసి-ఈ బిల్లు గురించి చాలా చక్కగావిశ్లేషించారు. 

ఆయన ఏమన్నారంటే, “అది తల్లి గర్భంలో మృత శిశువు వంటిది. దానిని కేసీఆర్ బయటకు తీశారు. కనుక దానిని సమాధి చేయక తప్పదు. అది అనేక చిల్లులున్న బిల్లు అది. ఇంకా చెప్పాలంటే అదొక లోపభూయిష్టమైన, మోసపూరితమైన బిల్లు. ఒకే బిల్లులో రెండు వివిధ వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించడమే దానిలో ప్రధాన లోపం. దానిని రాష్ట్రపతికి పంపితే ఆయన దానిని ప్రధాని మోడీకి పంపుతారు. దానిని ఆయన చెత్తబుట్టలో పడేస్తారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే దానిని నోటిఫై చేసినా అది కోర్టులలో నిలబడదు. అంటే ఆ బిల్లు డిల్లీలో లేదా కోర్టులలో సమాధి కాక తప్పదన్నమాట. 

గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని మేము కూడా స్వాగతిస్తాము. కానీ గిరిజనుల కోసం రూపొందించిన బిల్లులో ముస్లింలను చేర్చడం పొరపాటు. అది మోసపూరితమైన ఆలోచన. ఆవిధంగా చేసి దానికి రాజ్యాంగ ఆమోదం పొందే అవకాశం లేకుండా చేశారు కేసీఆర్. దీని వలన మరో ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం ముస్లింలకు ఇస్తున్న 4శాతం రిజర్వేషన్లను కూడా కేంద్రం తొలగించవచ్చు. దాని వలన ముస్లింలు నష్టపోతారు. ఈ కారణంగా హిందూ, ముస్లింల మద్య ద్వేష భావం తలెత్తే ప్రమాదం కూడా ఉంది. 

ఎస్సీ లేదా ఎస్టీలలో కొత్తగా ఒక్క కులాన్ని కలపలన్నా దానికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. వాటిలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టం వచ్చినట్లు కులాలను చేర్చాలనుకొంటే సాధ్యం కాదు. రాజ్యాంగం యావత్ దేశానికి వర్తిస్తుంది. రాష్ట్రాలకు వేర్వేరుగా ఉండదు. తమిళనాడు ఫార్ములా గురించి కేసీఆర్ బాగానే చెప్పారు. కానీ అది తాత్కాలికంగా చేసిన ఏర్పాటే తప్ప శాస్వితమైనది కాదని ఆయనకీ తెలుసు.  

ఇవన్నీ తెలిసి కూడా కేసీఆర్ ఇటువంటి బిల్లుని రూపొందించి డిల్లీ పంపిస్తున్నారంటే దానర్ధం ప్రజలను మభ్యపెట్టడానికేనని చెప్పక తప్పదు. అది డిల్లీలో లేదా న్యాయస్థానాలలోనో సమాధి కావడం తధ్యం,” అని జైపాల్ రెడ్డి అన్నారు.