ఇన్నేళ్ళకు ఒక్క సమస్య పరిష్కారం!

రాష్ట్ర విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల మద్య అనేక సమస్యలు, వివాదాలు ఏర్పడ్డాయి. వాటిలో కొన్ని పరిష్కారం కాగా కొన్ని ఎప్పటికీ అపరిష్కృతంగా నిలిచిపోయేలా కనిపిస్తున్నాయి. అటువంటి వాటిలో సమైక్య రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొన్న ఉన్నత విద్యామండలి యొక్క స్థిర, చిర ఆస్తులు, ఉద్యోగుల పంపకాలు కూడా ఒకటి. ఈ సమస్యపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భీష్మించుకొని కూర్చోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆస్తులను, ఉద్యోగులను పంచుకోవడానికి కేంద్రప్రభుత్వం మధ్యవర్తిగా ఇరు రాష్ట్రాల మద్య గత కొంత కాలంగా డిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. చివరికి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొన్నారు. 

దాని ప్రకారం ఏ రాష్ట్రంలో ఉన్న స్థిర, చరాస్తులు ఆ రాష్ట్రానికే చెందాలని, ఏ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పనిచేయాలని, నగదు నిలువలను మాత్రం విభజన చట్టంలోని సెక్షన్‌ 49 ప్రకారం జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచించింది. రెండు రాష్ట్రాల ప్రతినిధుల అంగీకారంతోనే ఈ ప్రకటన వెలువడింది కనుక ఈ సమస్య పరిష్కారం అయినట్లే భావించవచ్చు. 

నిజానికి ఏ రాష్ట్రంలో ఉన్న స్థిర, చిర ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణా ప్రభుత్వం మొదటి నుంచి చెపుతూనే ఉంది. దానిపై ఆంద్రా సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, ఉద్యోగులు పంపకాలలో తెరాస సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేసేది. చివరకు రెండూ రాజీపడటంతో ఈ సమస్య పరిష్కారం అయ్యింది. ఈ నిర్ణయానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉంటే, ఈవిధంగానే మిగిలిన వాటిని కూడా పరిష్కరించుకొనే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ సమస్యకు మూలకారణం ఆస్తుల పంపకంలో భిన్నాభిప్రాయాలు కాదని చెప్పవచ్చు. తెదేపా, తెరాసల మద్య రాజకీయ వైరం, వాటి నేతల పంతాలు, పట్టింపులు, అహం, ఇతర రాజకీయ కారణాల వలననే  గోటితో పోయే సమస్యను గొడ్డలితో పరిష్కరించుకోవలసి వచ్చిందని చెప్పక తప్పదు.