ఇదేనా అద్వానీకి మోడీ ఇచ్చే ఆ గురుదక్షిణ?

బాబ్రీ మశీదు కూల్చివేత కేసుపై సుప్రీంకోర్టు ఈరోజు భాజపాకు పెద్ద షాక్ ఇచ్చింది. దానిపై ఉత్తరప్రదేశ్ హైకోర్టు తీర్పుని పక్కన పెట్టి లక్నో దిగువకోర్టు నిర్ణయాన్ని సమర్ధిస్తూ, ఈ కేసులో నిందితులుగా పేర్కొనబడిన భాజపా సీనియర్ నేతల్ లాల్ కృష్ణ అద్వాని. మురళీ మనోహర్ జోషి, ప్రస్తుతం కేంద్రజలవనరుల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఉమా భారతి, ఇంకా మరి కొందరు భాజపా నేతలను ఈ కేసులో పునర్విచారించడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. దీనిపై రెండేళ్ళలో విచారణ పూర్తి చేయాలనీ గడువు విదించింది. 

కేంద్రంలో భాజపా ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడే సీనియర్ భాజపా నేతలకు వ్యతిరేకంగా ఇటువంటి తీర్పు రావడం నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయమే. తనకు రాజకీయ గురువు అయిన లాల్ కృష్ణ అద్వానికి గురుదక్షిణ సమర్పించుకొనే సమయం వచ్చిందని కొంతకాలం క్రితం ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పారు. ఈ జూలై నెలలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగుస్తుంది కనుక, అద్వానికి గురుదక్షిణగా రాష్ట్రపతి పదవిని సమర్పించుకోవచ్చనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. వాటిని మోడీ ఖండించలేదు కానీ అద్వాని మాత్రం తాను రాష్ట్రపతి రేసులో లేనని ప్రకటించి వాటికి ముగింపు పలికారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు గురుదక్షిణగా రాష్ట్రపతి ఇవ్వాలనుకొన్నారో తెలియదు కానీ ఈ కేసును ఇచ్చారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేయకుండా ఊరుకోవు. అయితే ఈ కేసు విచారణకు లక్నో కోర్టుకు రెండేళ్ళ సమయం ఇవ్వడమే భాజపా సీనియర్ నేతలందరికీ కొంత ఊరటనిచ్చే విషయం. కానీ ఇక రాజకీయాల నుంచి తప్పుకొనే వయసులో కోర్టుల చుట్టూ తిరుగావలసి రావడం చాలా కష్టమే. సుప్రీంకోర్టు తాజా తీర్పు దృష్ట్యా ఉమాభారతి తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయవలసి రావచ్చు. ఒకవేళ ఆమె చేయకపోతే ప్రతిపక్షాలు అందుకు గట్టిగా పట్టుపట్టవచ్చు.