జై తెలంగాణా! జై ఏబిఎన్!!!

తెరాస అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆ పార్టీ ప్రజా ప్రతినిధులపై అనుచితమైన వ్యాఖ్యలు చేశాయని ఆరోపిస్తూ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్స్ టీవి-9 మరియు ఏబిఎన్ (ఆంధ్రజ్యోతి)ల ప్రసారాలను దాదాపు ఏడాదికిపైగా తెలంగాణాలో నిలిపివేసిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ నిర్ణయంతో తమ ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదని తెరాస నేతలు, మంత్రులు చెప్పుకొన్నప్పటికీ అది దాని నిర్ణయమేనని అందరికీ తెలుసు. ఆ తరువాత ఆ రెండు ఛానల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సమస్యను ఏదోవిధంగా పరిష్కరించుకోవడంతో మళ్ళీ తెలంగాణాలో వాటి ప్రసారాలు సాగుతున్నాయి. అప్పటి నుంచి ఆ రెండు ఛానెల్స్ తో సహా ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా అంతా కాస్త ఆచితూచి మరీ వార్తలు ప్రచురిస్తున్నాయి. ఇదంతా జరిగి చాలా కాలమే అయిపోయింది.

ఈ మద్యన ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టడం, మరణించిన వారికి పెన్షన్లు కూడా ఇచ్చారు కూడా. అంటే ఆయన కూడా మీడియా పట్ల కాస్త మెత్తబడ్డారని అర్ధం అయ్యింది. ఈ నేపధ్యంలో ఇవ్వాళ్ళ నిజామాబాద్ ఎంపి కవిత ఏబిఎన్ (ఆంధ్రజ్యోతి) ప్రతినిధితో మాట్లాడిన తరువాత యదాప్రకారం జై తెలంగాణా! అంటూ తన ప్రసంగం ముగించారు. తరువాత “జై ఏబిఎన్” అని పలకడం విశేషం. ఒకప్పుడు దేనిని అసహ్యించుకొన్నారో...దేనిని నిషేధించారో..నేడు దానికే జై కొట్టడం ఆశ్చర్యమే కదా!అంటే ఏబిఎన్ (ఆంధ్రజ్యోతి)కి కూడా తెలంగాణా ప్రభుత్వ అధికారిక పత్రిక ముద్ర ఇచ్చినట్లేనా? ఏమో?