తూచ్! అన్నయ్యను ఆశీర్వదించమనలేదు: కవిత

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో కొన్ని రోజుల క్రితం తెరాస ఒక బహిరంగసభ నిర్వహించింది. మొట్టమొదటిసారిగా దానిలో నిజామాబాద్ ఎంపి కవిత, ఆమె సోదరుడు మంత్రి కేటిఆర్ కలిసి ఒకే వేదికపై నుంచి ప్రసగించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రామన్న (మంత్రి కె.తారక రామారావు) మన అందరి సమస్యలు తప్పక తీరుస్తాడని, కనుక ప్రజలు ఆయనను ఆశీర్వదించాలని కోరారు. 

అంటే ఆయన త్వరలో ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారనే అభిప్రాయం కలిగించారు. కేటిఆర్ కూడా తనకు ప్రజల ఆశీర్వాదం కావాలని కోరడంతో ఆమె మాటలకు మరింత బలం చేకూరింది. వారిరువురూ ఆ మాటలను ఏ ఉద్దేశ్యంతో అన్నప్పటికీ అవి ఒక పెద్ద చర్చకు దారి తీసాయి. వాటితో “కేటిఆర్ కి ముఖ్యమంత్రి పదవి” అంటూ మీడియాలో కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. 

సరిగ్గా ఇదే సమయంలో మంత్రి హరీష్ రావు ఒక ఇంటర్వ్యూలో “కేసీఆర్ తన కుమారుడు కేటిఆర్ ని ముఖ్యమంత్రి చేయదలిస్తే నాకేమీ అభ్యంతరం లేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకొన్నా మారు ప్రశ్నించకుండా శిరసావహిస్తాను,” అని అన్నారు. పార్టీలో ముగ్గురు కీలక నేతలు ఇంచుమించి ఒకే విధంగా మాట్లాడటంతో చెప్పడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. 

ఈ ఊహాగానాలను గమనించిన మంత్రి కేటిఆర్ వాటిని గట్టిగా ఖండించారు. మరో 10 ఏళ్ళు వరకు కేసీఆరే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని, తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని స్పష్టం చేశారు. తరువాత ఎంపి కవిత నేడు వాటిపై స్పందిస్తూ, “నేను రామన్నను ఆశీర్వదించమని ప్రజలను అడగలేదు. మా పార్టీని, ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరాను. మా పార్టీలో నెంబర్: 1 నుంచి నెంబర్: 1,000 వరకు అన్నీ కేసీఆరే. మా పార్టీలో నెంబర్:2 ఎవరూ లేరు. కనుక నెంబర్ గేమ్ ప్రసక్తే లేదు. నేను ఎక్కడి నుంచి ఏ సీటుకి పోటీ చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారు,” అని చెప్పారు. 

అంటే ప్రస్తుతానికి ఈ “కేటిఆర్ ముఖ్యమంత్రి పదవి” అనే కధ అర్ధాంతరంగా ముగించినట్లే చెప్పవచ్చు. కానీ ఇది యాదృచ్చికంగా జరిగిన రాజకీయ పరిణామాలా లేక ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకోనేందుకే కేసీఆర్ చేసిన చిన్న ప్రయోగమా? అనేది ప్రజలు ఊహించుకోవలసిందే.