సెల్వంపై పన్నీరు చల్లిన దినకరన్

తంతే బూర్లె గంపలో పడటం అంటే ఇదేనేమో. తమిళనాడులో శశికళతో జరిగిన పోరాటంలో ఓడిపోయి రాష్ట్రంలో ఏకాకిగా మారి ఏమిచేయాలో పాలుపోని స్థితిలో ఉన్న పన్నీర్ సెల్వంకు ఊహించని తాజా పరిణామాలు మళ్ళీ పదవి, అధికారం తెచ్చిపెట్టబోతున్నాయి. 

అన్నాడిఎంకె పార్టీ ఎన్నికల చిహ్నమైన రెండాకుల గుర్తుని దక్కించుకొనేందుకు శశికళ మేనల్లుడు దినకరన్ డిల్లీలో రూ.50 కోట్లు లంచం ఇచ్చేందుకు సిద్దపడి అడ్డంగా దొరికిపోవడంతో నేడోరేపో ఆయనను డిల్లీ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారని సమాచారం. ఊహించని ఈ పరిణామంతో ఎన్నికల చిహ్నాన్ని పన్నీర్ సెల్వం వర్గానికి కేటాయిస్తే, ఆయనే జయలలితకు అసలైన వారసుడనే అభిప్రాయం ప్రజలకు ఏర్పడవచ్చు. అప్పుడు అది మరొక పెద్ద సమస్యకు దారి తీయవచ్చు. కనుక ఇంతకాలం పన్నీర్ సెల్వంను అసలు పట్టించుకొని ముఖ్యమంత్రి పళనిస్వామి, ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆయనతో చేతులు కలపడానికి సిద్దం అయ్యారు. 

పన్నీర్ సెల్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏవీ ఫలించలేదు. కానీ ఈ హటాత్ పరిణామంతో ఆయన ఏ ప్రయత్నం చేయకపోయినా తంతే బూరెల గంపలో పడ్డట్లు మళ్ళీ వెలుగులోకి రావడమే కాక, పళనిస్వామికే షరతులు విదించగలుగుతున్నారు ఇప్పుడు. 

పళనిస్వామి తో తాను చేతులు కలపాలంటే, అయన ముఖ్యమంత్రిగా కొనసాగినా తనకు అభ్యంతరం లేదు కానీ ముందుగా శశికళను, ఆమె భర్త నటరాజన్, మేనల్లుడు దినకరన్ ఇంకా పార్టీలో ఆమె బంధువులను అందరినీ బయటకు సాగనంపాలని షరతు విదించారు. తనకు, తన అనుచరులకు మంత్రిపదవులు ఇవ్వాలని మరో షరతు విదించారు. అప్పుడే అందరం కలిసి అమ్మ ఆశయాలకు అనుగుణంగా పనిచేయగలమని, పార్టీలో, ప్రభుత్వంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతుందని తేల్చి చెప్పారు. 

నిజానికి పళనిస్వామికి కూడా అదే కోరుకొంటున్నారు. శశికళ, ఆమె బంధువులు తన చుట్టూ ఉన్నంత కాలం తన పదవికి, ప్రభుత్వానికి కూడా గ్యారంటీ ఉండదని ఆయనకు తెలుసు. కానీ ఇంతకాలం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అయన మౌనం వహించారు. ఇప్పుడు పన్నీర్ సెల్వం ఒత్తిడితోనే శశికళతో సహా అందరినీ బయటకు పంపవలసి వస్తోందని చెప్పి తప్పించుకోవచ్చు. ఒకవేళ ఈలోగానే డిల్లీ పోలీసులు దినకరన్ ను అరెస్ట్ చేసి పట్టుకుపోతే ఇక వారి గురించి ఆలోచించనవసరమే ఉండదు. 

కనుక పళని, పన్నీర్ వర్గాలు చర్చల కోసం కమిటీలు ఏర్పాటు చేసుకొని చర్చలకు సిద్దం అవుతున్నాయి. బహుశః నేడోరేపో అన్నాడిఎంకె పార్టీలో మరో కీలకమైన పరిణామాలు జరిగే అవకాశాలున్నాయి. పన్నీర్ సెల్వం ఇప్పటికే రెండుమూడుసార్లు చేతికి అందివచ్చిన అవకాశాలను జారవిడుచుకొన్నారు. అయినా మళ్ళీ మరో అవకాశం వచ్చింది. కనీసం ఇప్పుడైనా చురుకుగా వ్యవహరించి దీనినైనా తనకు అనుకూలంగా మలుచుకొంటారో లేదో చూద్దాం.