ఆ రెండాకుల ఖరీదు రూ.50 కోట్లా!

రెండాకుల ఖరీదు ఎంత ఉంటుంది? అంటే రూ.50 కోట్లు అని డిల్లీ పోలీసులు చెపుతున్నారు. నమ్మశక్యంగా లేదు కదా? కానీ రెండాకుల కోసం అడ్వాన్స్ గా ఇస్తున్న రూ.1.3 కోట్లు వారు సాక్ష్యంగా చూపిస్తుంటే నమ్మకుండా ఎలా ఉంటాము? ప్రపంచంలోకెల్లా ఖరీదైన ఆకులు డిల్లీలోనే ఉండటం మనకి గర్వకారణమే. ఇంతకీ అవి ఏ చెట్టు ఆకులో.. ఆచెట్టు ఎక్కడ ఉందో ఓ లుక్ వేద్దాం. 

డిల్లీలోని కేంద్ర ఎన్నికల కమీషన్ కార్యాలయంలో ఆ రెండాకుల చెట్టు ఉంది. కానీ దాని వేళ్ళు తమిళనాడులో ఉండటం విశేషం. తమిళనాడులోని అధికార అన్నాడిఎంకె పార్టీ ఎన్నికల చిహ్నం రెండాకులు. దాని కోసం శశికళ, పన్నీర్ సెల్వం వర్గం కీచులాడుకొంటున్నాయి. ఆ పంచాయితీపై ఈసి ఈరోజు తీర్పు చెప్పవలసి ఉంది. 

ఈలోగా శశికళ మేనల్లుడు దినకరన్ కొంచెం ఖర్చు పెట్టయినా సరే ఆ రెండాకులను స్వంతం చేసుకోవాలనుకొన్నారుట. దాని కోసం ఆయన డిల్లీలోని సుఖేష్ చంద్రశేఖర్ అనే ఒక బ్రోకర్ తో రూ.50 కోట్లు డీల్ కుదుర్చుకొన్నారు. ఆయన మనుషులు ఆదివారం రాత్రి డిల్లీలో హయత్ హోటల్ లో సదరు బ్రోకరును కలిసి అడ్వాన్స్ గా రూ.1.3 కోట్లు సమర్పించుకొంటున్న సమయంలో అతపై చాలా రోజులుగా నిఘా ఉంచిన డిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు రెడ్ హ్యాండ్ గా పట్టుకొన్నారు. నేడు వారిని కోర్టు ముందు హాజరుపరుచబోతున్నారు.

దీని గురించి నిన్న సుఖేష్ చంద్రశేఖర్, దినకరన్ మద్య సాగిన ఫోన్ సంభాషణల కాల్ రికార్డు, హయత్ హోటల్ లో సిసి ఫుటేజి కాపీ, సదరు బ్రోకరు వాగ్మూలం వగైరా సాక్ష్యాలు ఈ వ్యవహారంలో దినకరన్ పాత్రని ఖరారు చేసే సాక్ష్యాలుగా లభించడం డిల్లీ పోలీసులు ఆయనపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు.   

ఈ అమూల్యమైన రెండాకుల చెట్టు వేళ్ళు చెన్నైలో ఉన్నాయని ముందే చెప్పుకొన్నాము కనుక, నేడో రేపో డిల్లీ పోలీసులు చెన్నై వెళ్ళి దినకరన్ ను ప్రశ్నించడమో లేక అతనినే డిల్లీకి రప్పించి ప్రశ్నించడమో ఖాయం అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, డిల్లీ పోలీసులు చెపుతున్న ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని దినకరన్ చెపుతున్నారు. తనపై రాజకీయ కక్షతోనే ఎవరో ఈ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అవసరమైతే దీనిపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. డిల్లీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి పట్టుకుపోయేలోగా ఆయన ఇవ్వాళ్ళ బెంగళూరు వెళ్ళి అక్కడ జైల్లో ఉన్న అత్తమ్మ(శశికళ)కు ఈ విషయం చెప్పి, దీని నుంచి బయటపడే మార్గం కోరబోతున్నారుట! లేకుంటే తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న ఆయన కూడా అత్తతో కలిసి జైలులో కాలక్షేపం చేయవలసిరావచ్చు.