రేపు సభలో ఏమి మాట్లాడాలి? కిషన్ రెడ్డి

రిజర్వేషన్ బిల్లు, జి.ఎస్.టి., హెరిటేజ్ బిల్లులను ఆమోదించేందుకు ఆదివారం ఒక్కరోజు శాసనసభ సమావేశం కాబోతోంది. కనుక ఇవ్వాళ్ళ స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన బి.ఏ.సి. సమావేశం జరిగింది. దీనికి తెరాస, కాంగ్రెస్, తెదేపా, భాజపా, మజ్లీస్ సభ్యులు హాజరయ్యారు. 

రేపు శాసనసభలో ప్రవేశపెట్టబోయే ముస్లిం రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తామని భాజపా పదేపదే గట్టిగా హెచ్చరిస్తున్న కారణంగా, వాటి ముసాయిదా తీర్మానం కాపీలను కిషన్ రెడ్డికి ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాసనసభలో భాజపా కార్యాలయంలో ధర్నాకు కూర్చొన్నారు. ఆ బిల్లు కాపీలను ముందుగా సభ్యులకు ఈయకపోతే రేపు వాటి గురించి ఏమి మాట్లాడాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెరాస సర్కార్ ప్రజాస్వామ్యవిధానాలను తుంగలో తొక్కి తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రేవంత్ రెడ్డికి మరొక రకమైన అవమానం ఎదురైంది. ఈరోజు బి.ఏ.సి. సమావేశానికి రావాలని స్పీకర్ మధుసూదనాచారి స్వయంగా తనకు ఫోన్ చేసి ఆహ్వానించారని, కానీ సమావేశానికి హాజరయితే బలవంతంగా బయటకు పంపించేసి తనను అవమానించారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనను అనుమతించకూడదనుకొన్నప్పుడు ఎందుకు ఆహ్వానించారని ప్రశ్నించారు. స్పీకర్ తన కార్యాలయాన్ని తెరాస కార్యాలయంలాగ నడిపిస్తున్నారని విమర్శించారు. అన్ని పార్టీల సభ్యులను సమానంగా చూడవలసిన ఆయన, తనపై కక్ష కట్టినట్లు వ్యవహరించడం తగదని రేవంత్ రెడ్డి అన్నారు. 

ముస్లిం రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ భాజపా రేపు శాసనసభలో గట్టిగా పోరాడవచ్చు. కాంగ్రెస్, తెదేపాలు కూడా ఆ బిల్లుపై అసంతృప్తిగా ఉన్నాయి కనుక దానిపై లోతుగా చర్చించకుండా ఆమోదం తెలిపేందుకు అవి కూడా అభ్యంతరం తెలుపవచ్చు. కానీ సభలో తెరాసకు పూర్తి మెజారిటీ ఉంది కనుక వాటిని ఆమోదించుకోవడం లాంచనప్రాయమే.