మళ్ళీ 17న పంచాయితీ..

రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసుకొన్నా ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీలు మళ్ళీ ఈనెల 17న గవర్నర్ నరసింహన్ సమక్షంలో సమావేశం కాబోతున్నాయి. ఇప్పటికి నాలుగుసార్లు వారు సమావేశం అయ్యారు. కానీ ఎవరూ ఒక మెట్టు దిగేందుకు సిద్దంగా లేకపోవడంతో, వారి సమావేశాలతో ఎటువంటి ఫలితాలు రాలేదు. ముఖ్యంగా షెడ్యూల్: 10 పరిధిలోని సంస్థల పంపకాలపై ప్రతిష్టంభన ఏర్పడటంతో వారి చర్చలు ముందుకు సాగడం లేదు. కనుక ప్రతీసారి సమావేశం అయ్యి మళ్ళీ తరువాత ఎప్పుడు సమావేశం కాబోతున్నారో తేదీని ప్రకటించేసి వెళ్ళిపోతున్నారు.

షెడ్యూల్: 10 పరిధిలోని సంస్థల పంపకాలపై తెరాస ఎంపిలు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి తమకు న్యాయం చేయాలనీ కోరారు. కనుక ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వం వెనక్కి తగ్గే ఉద్దేశ్యంలో లేదని స్పష్టం అవుతోంది. వాటి సంగతి తెలిస్తే గానీ హైకోర్టు విభజన, సచివాలయం, శాసనసభ, మండలి భవనాల అప్పగింత గురించి ఆలోచించే ఉద్దేశ్యమే లేదని ఏపి ప్రతినిధులు గట్టిగా చెపుతున్నారు కనుక బహుశః ఎల్లుండి జరుగబోయే సమావేశం కూడా మళ్ళీ అలాగే ముగియవచ్చు.