ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ కాంగ్రెస్ నేతలని సన్నాసులని సంభోదిస్తుంటారు. ఇక ఏదైనా సమావేశం లేదా బహిరంగ సభలో గత ప్రభుత్వాలు తెలంగాణాను, ప్రజలను ఏవిధంగా దోచుకొన్నాయో వివరించి వాటిని కడిగిపారేస్తుంటారు. ఆయన విమర్శలను కాంగ్రెస్, తెదేపా నేతలు గట్టిగానే తిప్పికొడుతుంటారు. కానీ ఆ రెండు పార్టీలలో నుంచి వచ్చి తెరాసలో చేరిన నేతల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉంటుంది.
రైతులకు ఉచితంగా ఎరువులు అందించే పధకంపై ప్రస్తుతం తెరాస, కాంగ్రెస్ నేతల మద్య జరుగుతున్న యుద్ధంలో తెరాసలో చేరిన కాంగ్రెస్ నేతలు మళ్ళీ అటువంటి చేదు అనుభవమే ఎదుర్కోవలసి వస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్ల రాజకీయాలు చేయడం తప్ప మరేమీ చేయలేదని, అది చేయలేని పనులను తెరాస చేస్తోందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. తెరాసలో చేరిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ స్వయంగా తెరాసను వెనకేసుకొని వస్తూ మాట్లాడవలసిరావడం విశేషం.
తెలంగాణా అవసరాలు, సమస్యల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పూర్తి అవగాహన ఉందని కనుక రాష్ట్రం కోసం ఏమి చేయాలో ఆయనకు బాగా తెలుసునని డి.ఎస్.అన్నారు. కనుక కాంగ్రెస్ పధకాలను కేసీఆర్ కాపీ కొట్టారనడంలో అర్ధం లేదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా తెరాస మంత్రులు, నేతలు అందరూ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతున్నా, ఒకప్పుడు దానిలో కీలక పదవులు నిర్వహించిన డి.ఎస్. కే.కే. వంటివారికి ఏ మాత్రం రోషం రాకపోవడం విడ్డూరంగానే ఉంది. అంటే తెరాస నేతలు చేస్తున్న ఆ ఆరోపణలన్నీ నిజమేనని, ఆనాడు తాము అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణాకు ద్రోహం చేశామని వారు అంగీకరిస్తున్నట్లే భావించవలసి ఉంటుంది. లేదా పదవుల కోసం ఆశపడి తెరాసలో చేరారు కనుక అటువంటి అవమానాలను లైట్ తీసుకోక తప్పదని భావిస్తున్నారనుకోవాలి.