అలా చేస్తే కనబడకుండా పోతాయి!

రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిత్యం ఏదో ఒక అంశం తీసుకొని తెరాస సర్కార్ పై విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ముస్లిం రిజర్వేషన్ బిల్లు, రైతులకు ఉచితంగా ఎరువుల సరఫరాపై అవి చేస్తున్న విమర్శలకు మంత్రి జూపల్లి కృష్ణారావు బదులిస్తూ, “మా ప్రభుత్వం ఏమి చేసినా దానిని వ్యతిరేకించాలన్నట్లు ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. మంచిని మంచి అని ప్రతిపక్షాలు చెప్పలేకపోతున్నాయి. మా ప్రభుత్వం చేపట్టిన పనులను విమర్శిస్తూ, అడ్డుకొంటూ ప్రజలను ఆకట్టుకొందామనుకొంటే ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని గ్రహించాలి. 

కాంగ్రెస్ పధకాలను, ఆలోచనలను మేము కాపీ కొట్టమని చెప్పుకొంటున్నప్పుడు, మరి మీరు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఎందుకు అమలుచేయలేదు? ఎందుకంటే మీరు ప్రజలని ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తారు తప్ప వాళ్ళు కూడా మనవంటి మనుషులే..వారికి కష్టాలు, సమస్యలు ఉంటాయని, వాటిని అధికారంలో ఉన్నవాళ్ళే పరిష్కరించాలని ఎన్నడూ అనుకోలేదు కనుక. మనసుంటే మార్గం కనబడుతుందంటారు. మీకు మనసు లేక కనబడలేదు. మాకు ఉంది కనుక కనబడింది. అందుకే మా ప్రభుత్వం వరుసగా ఇన్ని సంక్షేమ పధకాలు అమలుచేస్తోంది. 

కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఇటువంటి ఆలోచనలు చేయలేదు. ఇప్పుడు మేము చేస్తుంటే స్వాగతించవలసిందిపోయి విమర్శిస్తున్నాయి, పనులను అడ్డుకోవడానికి కోర్టులలో కేసులు కూడా వేస్తున్నాయి. మీరు చేయలేని పనిని మేము చేస్తున్నప్పుడు మాకు సహకరించకపోయినా పరువాలేదు. అడ్డుకోకుండా ఉంటే అంతే చాలు. ఎవరు ఎటువంటి వాళ్ళో..ఏ ప్రభుత్వం తమకు మేలు చేస్తోందో ప్రజలే నిర్ణయించుకొంటారు,” అని జూపల్లి టీ కాంగ్రెస్ నేతలకు సున్నితంగా చురకలు వేశారు.