‘యశోదా బెన్’ అంటే ఎవరో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ భార్య అంటే..ఆమె టక్కున అందరికీ గుర్తువస్తారు. ఆమెతో మోడీ ఏనాడూ కాపురం చేయకపోయినా, ఆమెను భార్యగా అంగీకరించకపోయినా, ఆమె ఆయన భార్య కాకుండాపోదు. దేశంలో మహిళల పట్ల చాలా గౌరవం చూపే ప్రధాని నరేంద్ర మోడీ ఆమె పట్ల అంత నిరాదరణగా ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలియదు కానీ అది ఆయనకు ఎన్నటికీ మాయని మచ్చగానే మిగిలిపోతుందని చెప్పక తప్పదు. విశేషం ఏమిటంటే, మోడీ ఆమెను కాదనుకొన్నా నేటికీ ఆమె భర్త ఆయురారోగ్యాల కోసమే పూజలు చేస్తుంటారు. బహుశః ఇప్పుడు అదే పని మీద వచ్చినట్లు భావించవచ్చు.
ఇక విషయం ఏమిటంటే, రిటైర్డ్ టీచర్ అయిన యశోదా బెన్ గురువారం రాత్రి గుజరాత్ నుంచి వికారాబాద్ వచ్చారు. ఆమె అక్కడికి వస్తున్న సంగతి ఎవరికీ తెలియదు. అక్కడికి చేరుకొన్న తరువాత కూడా ఎటువంటి హడావుడి చేయకుండా స్థానిక ఆలయ పూజారి ఇంటిలో బస చేశారు.
శుక్రవారం ఉదయం వికారాబాద్ లోని నాగదేవత, సంతోషిమాత ఆలయాలను దర్శించుకొన్నారు. అనంతరం అక్కడ జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆమె స్వయంగా భక్తులకు భోజనం వడ్డించారు. అప్పుడే ఆమె సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ భార్య అని అందరూ గుర్తించారు. అంత నిరాడంబరంగా ఆమె వ్యవహరించారు. ఈరోజు అంబేద్కర్ జయంతి కనుక అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె గురించి తెలుసుకొన్న స్థానిక భాజపా నేతలు పరుగున అక్కడికి చేరుకొన్నారు. వారితో ఆమె కాసేపు మాట్లాడారు, శనివారం ఉదయం కూడా ఆమె స్థానిక ఆలయాలలో కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించుకొన్నాక రాత్రి తిరిగి గుజరాత్ కు బయలుదేరి వెళ్ళిపోతారు.