తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో జనహిత సమావేశ మందిరంలో రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారికి ఊహించని వరం ఒకటి ప్రకటించారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి రాష్ట్రంలో గల 55 లక్షల మంది రైతులకు ఉచితంగా ఎరువులు అందిస్తామని ప్రకటించారు. ఏడాదికి 24-26 లక్షల టన్నుల ఎరువులను వాడుతున్నట్లు లెక్కలు చెపుతున్నాయని, అది ఎంతయితే అంత రైతులకు ఉచితంగా అందజేస్తామని చెప్పారు.
ప్రతీ రైతుకి ఎకరానికి 2 బస్తాల దుక్కి మందు, 3 బస్తాల యూరియాను కొనుగోలు చేసుకొనేందుకు రూ.4,000 చొప్పున వారి బ్యాంక్ ఖాతాలలోనే జామా చేస్తామని చెప్పారు. దీని కోసం గ్రామాలలో రైతుసంఘాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రైతులు అందరూ తమ బ్యాంక్ ఖాతాలతో సహా అన్ని వివరాలతో కూడిన జాబితాలను తయారుచేసుకొని వాటిని ఆ గ్రామ సంఘాల ద్వారా అధికారులకు అందజేయాలని కోరారు. వారు ఆ వివరాలను కంప్యూటర్లలోకి ఎక్కిస్తారని, వాటి ఆధారంగా వచ్చే ఏడాది నుంచి నేరుగా రైతుల ఖాతాలలోకే డబ్బు పంపిస్తామని చెప్పారు. ప్రభుత్వంపై రుణమాఫీ భారం తీరిపోయింది కనుక ఇప్పుడు రైతులకు సహాయపడేందుకు ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందేమీ ఉండదని అన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ రైతులకు వ్యవసాయానికి సంబంధించి చాలా చక్కటి, విలువైన సూచనలు ఇచ్చారు. రైతులు అందరూ ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వస్తున్న మార్పులను, నూతన విధానాలు, మెలకువలను నేర్చుకోవడం నేర్చుకోవాలని సూచించారు. అలాగే ఇరుగుపొరుగు రాష్ట్రాలు దేశాలలో అనుసరిస్తున్న లాభసాటి విధానాలు, వ్యవసాయంలో యంత్రాల వినియోగం గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయాలని అన్నారు. అందరూ ఒకే రకం పంట పండించినట్లయితే గిట్టుబాటు ధరలు రావు కనుక వేర్వేరు రకం పంటలు వేయడం మంచిదని సూచించారు. గతంలో ఆంధ్రా పాలకులు తెలంగాణా రైతులను, వ్యవసాయాన్ని, సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తోందని, సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి కోటి ఎకరాలకు నీళ్ళు అందించాలనే కృత నిశ్చయంతో ముందుకు సాగుతోందని అన్నారు. “నేను బ్రతికి ఉండగానే మన పొలాలకు గోదావారి నీళ్ళు పారిస్తాను. ఆ నమ్మకం నాకుంది,” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.