ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో భాజపా ఈవిఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచిందని ఆరోపిస్తున్న ప్రతిపక్ష పార్టీలకు కేంద్ర ఎన్నికల కమీషన్ వాటిని హ్యాకింగ్ చేసి చూపమని సవాలు విసిరింది. వచ్చే నెల మొదటివారం నుంచి 10 రోజుల పాటు ఈవిఎంలను నిర్వాచన్ సదన్ కార్యాలయంలో వాటికి అందుబాటులో ఉంచుతామని, రాజకీయ పార్టీలు, ఐటి నిపుణులు ఎవరైనా సరే వాటిని హ్యాకింగ్ చేసి చూపాలని ఈసి సవాల్ విసిరింది. ఇదివరకు 2009 ఒకసారి ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు, 100 ఈవిఎంలను పరీక్షకు పెట్టినప్పుడు ఎవరూ వాటిని హాయ్క్ చేయలేకపోయారని ఈసి గుర్తు చేసింది.
ఈసి సవాలును డిల్లీలో ఆమాద్మీ పార్టీ మొదట స్పందించింది. ఈసి తన మాటకు కట్టుబడి దీని కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలనీ డిమాండ్ చేసింది.
ఈ అంశంపై ఇతరాపార్టీలతో కలిసి ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలో సీనియర్ నేతల నుంచే ఎదురుదెబ్బలు తినవలసివస్తోంది. పంజాబ్ ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమరీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, “ఒకవేళ ఈవిఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యమైయుంటే పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచేదే కాదు..నేను ముఖ్యమంత్రి అయ్యే వాడినే కాదు. మళ్ళీ అకాలీదళ్-భాజపా కూటమే అధికారంలోకి వచ్చి ఉండేది,” అని అన్నారు.
ఇక మాజీ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ మాట్లాడుతూ, “నేను న్యాయశాఖా మంత్రిగా ఉన్నప్పుడే ఈవిఎంలను మా ప్రభుత్వమె ప్రవేశపెట్టింది. అప్పుడు కూడా దానిపై ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. కానీ పరీక్షిస్తే వాటిలో ఎటువంటి లోపాలు లేవని, ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని నిరూపితం అయ్యింది. ఇప్పుడు మా పార్టీ ఓడిపోయిందని ఈవిఎంలను తప్పుపట్టడం తప్పు. అది నిరాశావాదులు చేసే వాదన. అటువంటివారితో కలిసి మా పార్టీ కూడా ఆందోళన చేయడం ఇంకా తప్పు. ఒక ప్రభంజనం వచ్చినప్పుడు ఏదో ఒక పార్టీ గొప్ప మెజార్టీతో గెలవడం సహజమే. అందుకు ఈవిఎంలను తప్పు పట్టడం సరికాదు. ఈ విషయంపై పార్టీలో ఎవరూ మావంటి సీనియర్లను సంప్రదించలేదు,” అని అన్నారు.