ముస్లింలకు రిజర్వేషన్లు అలా ఇస్తాము

ఈరోజు జరిగిన తెలంగాణా మంత్రివర్గ సమావేశంలో తీసుకొన్న ముఖ్య నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియా ప్రతినిధులకు వివరించారు. రాజ్యాంగపరంగా ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడానికి వీలు లేదు కనుక అందుకు వేరే ప్రత్యామ్నాయం కనుగొన్నట్లు చెప్పారు. ముస్లింల ఆర్ధిక, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని వారికి బిసి-ఈ కేటగిరీ క్రింద 12శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముస్లింల స్థితిగతులు అధ్యయనం చేయడానికి నియమించిన సుధీర్ కమిషన్, ఎస్టీల కోసం ఏర్పాటు చేసిన చెల్లప్ప కమిషన్ చేసిన సిఫార్సుల ఆధారంగా ఇరు వర్గాలకు చెరో 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందని చెప్పారు. ఆర్ధిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఏ వర్గం ప్రజలకైన రిజర్వేషన్లు కల్పించడానికి వీలు ఉంది కనుక మొత్తం రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువైనా చట్టపరంగా ఎటువంటి చిక్కులు రావని చెప్పారు. ఈవిధంగా తమిళనాడులో 62 శాతం పైగా రిజర్వేషన్లు ఇస్తున్నారు కనుక తెలంగాణాలో కూడా ఎటువంటి సమస్య రాకపోవచ్చని అన్నారు. 

ఈ బిల్లులను ఆమోదింప జేసుకొనేందుకు ఈనెల 16న శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.