ఏపిలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతిని అరికట్టేందుకు సిఎం చంద్రబాబు నాయుడు ఈనెల 14న ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ను ప్రారంభించబోతున్నారు. వివిధ పనుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ప్రభుత్వోద్యోగులు, అధికారులు లంచాలు డిమాండ్ చేస్తుండటం లేదా సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వంటి చేదు అనుభవాలు ప్రజలందరూ ఎప్పుడో ఒకసారి ఎదుర్కొంటూనే ఉంటారు. అవినీతికి పాల్పడుతున్నవారిపై ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రభుత్వానికి పిర్యాదు చేయవచ్చు.
ఇది చాలా మంచి ఆలోచనే. కానీ మంత్రుల స్థాయిలో ఉన్నవారే బారీ అవినీతికి పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నప్పుడు, క్రిందస్థాయి అధికారులు, ఉద్యోగులు మడి కట్టుకొని కూర్చోరు. వారిపై చర్యలు తీసుకొనే ముందు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలపై చంద్రబాబు నాయుడు ముందు చర్యలు తీసుకొని చూపిస్తే అందరూ హర్షిస్తారు.
తెదేపా పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ప్రతిపక్షాలే కాదు ...తెదేపాకు మిత్రపక్షంగా ఉన్న భాజపా, జనసేనలు కూడా ఆరోపిస్తూనే ఉన్నాయి. ఒకవేళ దీనిని వైకాపా ఒక ఆయుధంగా మలుచుకోదలిస్తే, రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అన్ని ప్రభుత్వ శాఖలపై పిర్యాదులు చేయడం మొదలుపెడితే, తెదేపా సర్కార్ వాటిని పరిష్కరించగలదా? అనే లేదనే చెప్పవచ్చు. కనుక ఈ మొబైల్ యాప్ ద్వారా వచ్చే పిర్యాదులపై చర్యలు తీసుకోవాలన్నా కూడా ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధి, దానితో బాటు ధైర్యం కూడా ఉండాలి. అప్పుడే ఇటువంటి ప్రయత్నాల వలన ఆశించిన ప్రయోజనం కనబడుతుంది. అలాకాక కేవలం ప్రచారార్భాటానికే పరిమితం అయితే దాని వలన విలువైన ప్రజాధనం వృదా అవుతుంది.