కులభూషణ్ కోసం ఎంతవరకైనా వెళ్తాం!

భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ గూడచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పాక్ మిలటరీ కోర్టు ఆయనకు ఉరిశిక్ష విదించడంపై నేడు పార్లమెంటు ఉభయ సభలలో సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉద్దేశ్యపూర్వకంగానే అతనిపై గూడచారి ముద్రవేసి ఎటువంటి న్యాయ విచారణ జరుపకుండా ఉరి శిక్ష విదించిందని అందరూ అభిప్రాయపడ్డారు. అతనిని రక్షించేందుకు భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రతిపక్ష పార్టీ సభ్యులు కేంద్రప్రభుత్వానికి హామీ ఇచ్చారు. అతను కేవలం ఒక తల్లి బిడ్డడు మాత్రమే కాదని, యావత్ భారతీయులకు ఆత్మీయుడేనని అన్నారు. కనుక      అతనిని ఎలాగైనా కాపాడాలని కోరారు. 

భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తనదైన శైలిలో స్పందిస్తూ, ఒకవేళ పాక్ అతనిని విడిచిపెట్టకపోతే, పాక్ చేసిన ఆరోపణలు నిజం చేసి చూపాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేరు చేసి దానిని స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

లోక్ సభలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, రాజ్యసభలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, కులభూషణ్ జాదవ్ ప్రాణాలు కాపాడి స్వదేశం తిరిగి తీసుకు వచ్చేందుకు భారత ప్రభుత్వం ఏమేమి చేయగలదో అన్ని ప్రయత్నాలు చేస్తుందని హామీ ఇచ్చారు. అందుకోసం ఎంతవరకైనా వెళ్ళడానికి సంకోచించం అని తేల్చి చెప్పారు.