సంక్షేమ పధకాలు ఇక వేగవంతం

ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులతో తన అధికార నివాసం ప్రగతి భవన్ లో సుమారు 9 గంటల పాటు సమావేశం నిర్వహించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, అమ్మ ఒడి, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పెన్షన్లు, గొర్రెల పంపకం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలపై లోతుగా చర్చించి అనేక నిర్ణయాలు తీసుకొన్నారు. ఆ వివరాలు క్లుప్తంగా: 

1. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు. ఈ సంక్షేమ పధకాలకు లబ్దిదారులను గుర్తించి అమలు చేయడంలో లో జిల్లా కలెక్టర్లకు పూర్తి స్వేచ్చ.

2. అమ్మ ఒడి, కేసీఆర్ కిట్స్, ఒంటరి మహిళలకు పెన్షన్లు అమలు

3. రాష్ట్రంలో 81 వేలమంది బీడీ కార్మికులను ప్రావిడెంట్ ఫండ్ ఆధారంగా గుర్తించి పెన్షన్లు అందజేయడం. 

4. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 1400 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించాలి. స్థానిక ఎమ్మెల్యే సిఫార్సుల మేరకు లబ్దిదారులకు ఇళ్ళు కేటాయించాలి. 

5. రాష్ట్రంలో గోళ్ళ, కురుమ కులస్తులకు సహకార సంఘాలు ఏర్పాటు చేసి, అర్హులైన లబ్దిదారులను గుర్తించి ఒక్కొక్కరికీ 75శాతం రాయితీపై 21 గొర్రెలు పంపకం.

6. చేపల పెంపకానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. 

7. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సంచార పశు వైద్యశాల ఏర్పాటు. పశువైద్యుల పోస్టుల భర్తీ.  

8. సాదాబైనమాల దరఖాస్తులను వీలైనన్ని ఆమోదించాలి. చిన్న చిన్న లోపాలను చూపి తిరస్కరించకూడదు. 

9. ఎస్సీ, ఎస్టీల సంక్షేమ పధకాల అమలు, నిధుల ఖర్చుపై నిరంతర పర్యవేక్షణ కోసం క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించాలి. జిల్లా కలెక్టర్లు నెలకొకసారి సమీక్షా సమావేశం నిర్వహించాలి.

10. గ్రామీణ ప్రాంతాలలో పనిచేసేందుకు వైద్యులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ పధకాలను అధికారులు, కలెక్టర్లు రూపొందించాలి.