పాక్ భద్రతదళాలకు పట్టుబడిన మాజీ భారతీయ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కు పాక్ మిలటరీ కోర్టు ఉరి శిక్ష విదించింది. అతనిని గత ఏడాది బలూచిస్తాన్ ప్రాంతంలో పాక్ భద్రతాదళాలు అరెస్ట్ చేశాయి. అతను భారత్ గూడచారి అని పాక్ ఆరోపించింది. బలూచిస్తాన్ లో వేర్పాటువాదులను ప్రోత్సహించి, తమ దేశాన్ని విచిన్నం చేయడానికి భారత్ పన్నుతున్న కుట్రలను అమలుచేయడానికే అక్కడికి వచ్చాడని ఆరోపించింది. అతని చేత వీడియో వాగ్మూలం కూడా ఇప్పించి దానిని మీడియాకు విడుదల చేసింది. దానిలో అతను పాక్ ఆరోపణలను దృవీకరిస్తూ మాట్లాడారు.
అయితే పాక్ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. అతను భారత్ నేవీలో పని చేసి పదవీ విరమణ చేశాడని, తరువాత వేరే ఎక్కడా పనిచేయలేదని చెప్పింది. అప్పటి నుంచి ఈ కేసు మరుగున పడిపోయింది. అతనిని విచారించిన పాక్ మిలటరీ కోర్టు అతను పాక్ లో గూడచర్యానికి పాల్పడ్డాడని నిర్దారించి ఉరి శిక్ష విదించింది. కులభూషణ్ జాదవ్ మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాకు చెందిన వ్యక్తి. దీనిపై భారత్ ఇంకా స్పందించవలసి ఉంది.