తెరాస సర్కార్ కు మరో సవాలు?

తెరాస సర్కార్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో ఇప్పటికే అనేక చిక్కులు ఎదుర్కొంటోంది. ఒకవైపు నిర్వాసితులు, మరోపక్క ప్రతిపక్షాల ఆందోళనలు...న్యాయస్థానాలలో అవి వేస్తున్న కేసులు, టిజెఎసి దాని అనుబంధ సంఘాల ఆందోళనలు చాలా అవరోధాలే ఎదుర్కొంటోంది. ఇప్పుడు వాటికి తోడు ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ కూడా తెరాస సర్కార్ చేపడుతున్న భూసేకరణపై పోరాడేందుకు సిద్దం అవుతున్నారు. ఆమె నిన్న హైదరాబాద్ వచ్చినప్పుడు, ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులతో సమావేశమయినప్పుడు ఈ భూసేకరణ సమస్యలపై లోతుగా చర్చించారు.

తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వం ప్రాజెక్టులకు అవసరమైనంత భూమిని భూసేకరణ చట్టం 2013 ప్రకారం సేకరిస్తే ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ తన ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే తెరాస సర్కార్ కూడా పోరాడాక తప్పదు. తను చేసిన ‘నర్మదా బచావ్’ పోరాటం గురించి, దాని వలన నిర్వాసిత రైతులకు కలిగిన ప్రయోజనాల గురించి ఆమె వివరించారు. త్వరలోనే తను మళ్ళీ  హైదరాబాద్ వస్తానని, అప్పుడు పరిస్థితులను మరోసారి సమీక్షించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.