మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలు కేంద్రంగా నడుస్తున్న ఐబిసి24 అనే టీవీ న్యూస్ ఛానల్ లో సుప్రీత్ కౌర్ అనే న్యూస్ రీడర్ కు శుక్రవారం ఉదయం వార్తలు చదువుతున్న సమయంలో ఊహించని కష్టం వచ్చింది. ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో మహాసముంద్ జిల్లా నుంచి ఆ ఛానెల్ స్థానిక విలేఖరి ఆమెకు ఒక రోడ్డు ప్రమాదం గురించి సమాచారం ఇచ్చాడు. ఆ కారు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. వారిలో సుప్రీత్ కౌర్ భర్త కూడా ఒకరు. విలేఖరి అందించిన సమాచారం వినగానే ఆమెకు తన భర్త మరణించారని అర్ధం అయిపోయింది. అయినా ఆమె దుఃఖాన్ని దిగమింగుకొని, ఆ ప్రమాదం గురించి వార్తను చదివి వినిపించింది. ఆ తరువాత 30 నిముషాల సేపు ఆమె తమాయించుకొంటూ వార్తలు చదివారు. న్యూస్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తరువాత భోరున విలపించారు. వృత్తి పట్ల ఆమె కనబరిచిన అంకితభావం, ఆమె మనోనిబ్బరాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె గురించి దేశంలో అన్ని న్యూస్ ఛానల్స్ లో, పత్రికలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి.