మన దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా రాజకీయ పార్టీలు, వాటి నేతలు నానాటికీ దిగజారిపోతుండటం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటుంది. తాజాగా తమిళనాడులోని పన్నీర్ సెల్వం వర్గం మరోమెట్టు క్రిందకు దిగజారింది.
జయలలిత మృతితో ఖాళీ అయిన చెన్నైలోని ఆర్.కె.నగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఈనెల 12న ఉపఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో పన్నీర్ సెల్వం వర్గం తరపున పోటీ చేస్తున్న ఇ.మధుసూదన్ జయలలిత ప్రతిమ కలిగి ఉన్న శవపేటిక నమూనాను తన వాహనం ముందు పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అది చాలా విచిత్రంగా ఉండటంతో ప్రజలు దానిని ఎగబడి చూస్తున్నారు. జయలలితకు అసలైన వారసుడైన పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన తనకు ఓటు వేసి గెలిపిస్తే, జయలలిత మృతిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని చెపుతున్నారు. అది అయన శక్తికి మించిన పనే అని అందరికీ తెలుసు. అయినా జయలలిత శవపేటికను పెట్టుకొని ఆవిధంగా చెపుతూ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నాడిఎంకె వర్గం తరపున పోటీ చేస్తున్న దినకరన్ ఆరోపించారు. దినకరన్ అనుచరులు నియోజకవర్గంలో ఓటర్లు విచ్చలవిడిగా డబ్బు పంచిపెడుతున్నారని పన్నీర్ సెల్వం ఆరోపిస్తున్నారు.
జయలలిత మృతి చెంది నాలుగు నెలలు పైనే అయినప్పటికీ, ఆమె పేరును, చివరికి ఆమె శవపేటికను పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతుండటం చూస్తుంటే సదరు నేతలు తమకు ప్రజలలో ఏమాత్రం గుర్తింపు, ఆదరణ లేదని స్వయంగా చాటి చెప్పుకొంటున్నట్లుంది.