అక్రమాస్తుల కేసులలో ఏ-1 నిందితుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ కేసులలో సాక్షులను ప్రభావితం చేసేవిధంగా వ్యవహరిస్తున్నందున ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సిబిఐ అధికారులు సిబిఐ కోర్టులో వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. దానిపై జగన్ తరపు న్యాయవాది ఈరోజు కౌంటర్ దాఖలు చేశారు. అనంతరం సిబిఐ కోర్టు ఈ కేసును ఏప్రిల్ 21వ తేదీని వాయిదా వేసింది.
ఈ కేసులో ఒక సాక్షిగా ఉన్న మాజీ ఐఎఎస్ అధికారి రమాకాంత్ రెడ్డిని కొన్ని రోజుల క్రితం సాక్షి న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. దానిలో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో అసలు బలం లేదని కనుక కోర్టులో వీగిపోవచ్చని చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్న ఒక కేసుపై ఒక ప్రధాన సాక్షి, ప్రధాన నిందితుడు (జగన్) కు అనుకూలంగా మాట్లాడిన ఈ మాటలు ఈ కేసును, ఇతర సాక్షులను ప్రభావితం చేయడమేనని కనుక బెయిల్ షరతులను ఉల్లంగించినందుకు జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఇదే సమయంలోనే డిల్లీ పర్యటనలో ఉన్న జగన్ అక్కడ ప్రతిపక్ష పార్టీ నాయకులను కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ కలిసి అన్యాయంగా తనపై ఈ కేసులు పెట్టించి, రాజకీయంగా తనను అణచివేయాలని ప్రయత్నిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అవి రాజకీయ కక్ష సాధింపు చర్యలే తప్ప తనకు ఏ పాపం తెలియదని చెప్పినట్లు సమాచారం.
ఒకవేళ ఈ మాటలను కూడా సిబిఐ అధికారులు పరిగణనలోకి తీసుకొంటే జగన్ బెయిల్ రద్దు చేయమని కోరడానికి మరో బలమైన కారణం దొరికినట్లే అవుతుంది. ఒకవేళ జగన్ చెప్పిందే నిజమనుకొంటే మరి నేటికీ ఈడి అధికారులు జగన్ ఆస్తులను ఎందుకు జప్తు చేస్తున్నారు? దానిపై ఆయన కేంద్రప్రభుత్వానికి ఎందుకు పిర్యాదు చేయడం లేదు? అనే సందేహం కలుగుతుంది. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తున్న నేతలకు జగన్ గురించి, ఆయన కేసుల గురించి తెలియదనుకోలేము. కనుక వారికి జగన్ ఈవిధంగా చెప్పు కోవడం హాస్యాస్పదంగా ఉంది.