సింగరేణి కార్మికులకు జీతాల పెంపు, బోనస్ చెల్లింపు, వారసత్వ ఉద్యోగాలకు జీవో వంటి నిర్ణయాలతో వారి మనసులు దోచుకొన్న తెరాస సర్కార్, ఇప్పుడు అందుకు పూర్తి విరుద్దంగా వారిపై ఉక్కుపాదం మోపింది. వారసత్వ ఉద్యోగాలు, మరికొన్ని ఇతర డిమాండ్ల కోసం సింగరేణి కార్మికులు సమ్మెకు సిద్దం అవుతున్న సంగతి తెలియగానే, సింగరేణిలో 6నెలల పాటు సమ్మెలు చేయడాన్ని నిషేదిస్తూ తెరాస సర్కార్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా తన ఆదేశాలను దిక్కరించి సమ్మె చేసినట్లయితే వారిపై కటిన చర్యలు తీసుకోబడతాయని ఆ ఉత్తర్వులలోనే హెచ్చరించింది.
ఇటువంటి ఉత్తర్వులతో సమ్మెలు ఆగవని ఉద్యమనేత అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియదనుకోలేము. పైగా ఇటువంటి ఆదేశాలు కార్మికులను మరింత రెచ్చగొట్టినట్లవుతుంది. ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు చేజేతులా బలమైన ఆయుధం అందించినట్లు అవుతుంది. ఇప్పటికే ధర్నా చౌక్ ను హైదరాబాద్ నగర శివార్లకు తరలించి ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతూ కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలు రేపు దీనిపై గట్టిగానే స్పందించవచ్చు.