ఎయిర్ ఇండియా అధికారిని 25సార్లు చెప్పుతో కొట్టానని స్వయంగా మీడియాకు గర్వంగా చెప్పుకొన్న శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ ఈరోజు లోక్ సభలో మాటమార్చి తాను ఎవరినీ కొట్టలేదని, ఎయిర్ ఇండియా ఉద్యోగులే తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. అయినప్పటికీ తను పార్లమెంటు సభ్యులకు క్షమాపణ చెపుతున్నానని, కానీ ఎయిర్ ఇండియా అధికారికి చెప్పబోనని అన్నారు. ఎంపినైన తనతో అనుచితంగా ప్రవర్తించినందుకు ఎయిర్ ఇండియా అధికారి, సిబ్బందిపై చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.
దానికి కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతి రాజు సమాధానమిస్తూ రవీంద్ర గైక్వాడ్ మొదట పౌరుడని, ఆ తరువాతే ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికుడని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. కనుక దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని బదులిచ్చారు.
ఆయన జవాబు విని శివసేన ఎంపిలు లోక్ సభలో చాలా రభస చేశారు. ఎంపి అయిన రవీంద్ర గైక్వాడ్ ను విమానంలో ప్రయాణించకుండా నిషేధం విదించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేనకు చెందిన కేంద్రమంత్రి అనంత గీతేతో సహా ఆ పార్టీ ఎంపిలు అశోక్ గజపతి రాజు వద్దకు వచ్చి అనుచితంగా మాట్లాడారు. వెంటనే రాజ్ నాథ్ సింగ్ అక్కడకు వచ్చి వారికి నచ్చజెప్పి వెనక్కు తిప్పి పంపేశారు.
రవీంద్ర గైక్వాడ్ విమానంలో అనుచితంగా వ్యవహరిస్తే, శివసేన ఎంపిలు లోక్ సభలోనే అనుచితంగా వ్యవహరించారు. లోక్ సభలో స్పీకర్, కేంద్రమంత్రులు, ఎంపిల సమక్షంలోనే ఒక మంత్రి సాటి కేంద్రమంత్రిని కొట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు. సభలో అంత అనుచితంగా వ్యవహరిస్తున్న అటువంటి ఎంపిలపై, కేంద్రమంత్రిపై స్పీకర్ కటినమైన చర్యలు తీసుకోకుండా వారిని బ్రతిమాలుకోవడం ఇంకా సిగ్గు చేటు. అందరికీ ఆదర్శంగా నడుచుకోవలసిన ప్రజాప్రతినిధులు పార్లమెంటు సాక్షిగా ఇంత హీనంగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తోంది. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, శివసేన ఎంపిల ఒత్తిడి భరించలేక ఎంపి రవీంద్ర గైక్వాడ్ పై విమానయాన సంస్థలు విదించిన నిషేధాన్ని ఈరోజు సాయంత్రం ఎత్తివేయబోతున్నట్లు తాజా సమాచారం.