అక్కడ కూడా పంటరుణాలు మాఫీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా రైతుల పంటరుణాల మాఫీ చేయబడ్డాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఐదు ఎకరాలు అంతకంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు పంట రుణాల మాఫీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 2017, మార్చి 31 వరకు తీసుకొన్న పంట రుణాలకు ఇది వర్తింపజేస్తారు. రాష్ట్రంలో సుమారు 2.30 కోట్లు మంది రైతులున్నారు. వారిలో 2.15 కోట్లు మంది చిన్న, సన్నకారు రైతులు దీని వలన లబ్ది పొందుతారు. ఈ నిర్ణయం వలన రాష్ట్ర ప్రభుత్వంపై రూ.36,359 కోట్లు ఆర్దికభారం పడుతుంది. దీని కోసం కిసాన్ రాహత్ బాండ్లు (రైతు ఉపశమన బాండ్లు) జారీ చేయాలని నిర్ణయించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 5,000 గోధుమల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి మొదటి దశలో 40 లక్షల టన్నులు సేకరించాలని నిర్ణయించారు. క్వింటాలుకు లోడింగ్ చార్జ్ తో కలిపి కనీస మద్దతు ధర రూ.1635 చెల్లిస్తామని మంత్రి సిద్దార్థ నాథ్ సింగ్ తెలిపారు. ఈ గోధుమ సేకరణ కేంద్రాలలో ఎక్కడా దళారీ వ్యవస్థ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని, రైతుల బ్యాంక్ ఖాతాలలోనే నేరుగా డబ్బు జమా చేస్తామని చెప్పారు.