టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, మరికొందరు ప్రజాసంఘాల నేతలు నిన్న రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తో హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను నగర శివార్లకు తరలించడం, సింగరేణి ఓపెన్ కాస్ట్ త్రవ్వకాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న పోరాటాలలో అందరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ కోదండరామ్, మందకృష్ణ మాదిగ, గద్దర్, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు అందరూ కలిసి పోరాడేందుకు సిద్దపడితే, భాజపా వారికి మద్దతు ఇస్తుందని డా.కె.లక్ష్మణ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రొఫెసర్ కోదండరామ్ తెదేపా, కాంగ్రెస్ నేతలను కూడా కలిసి తమ పోరాటాలకు వారి మద్దతు కూడా కోరబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఈ సమస్యలపై తెరాస సర్కార్ తో పోరాటాలు చేస్తున్నాయి కనుక అవి ప్రొఫెసర్ కోదండరామ్ కు మద్దతు ఈయడంలో ఆశ్చర్యం లేదు.
కాంగ్రెస్, తెదేపా, వామపక్షాలతో కలిసి పనిచేయడం ప్రొఫెసర్ కోదండరామ్ కు ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. కానీ మతం ప్రాతిపదికగా రాజకీయా పోరాటాలు చేస్తున్న భాజపాతో కలిసి పనిచేయగలరో లేదో చూడాలి. ఆయన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. ఆ ప్రతిపాదనను భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈవిషయంలో తెరాస, భాజపాల మద్య లోపాయికారీ ఒప్పందం కుదిరినట్లయితే వచ్చే ఎన్నికలలో ఆ రెండు చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతానికి భాజపా తెరాసకు దూరంగా ఉంటూ దానితో పోరాడుతోంది కనుక కొన్ని ఎంపిక చేసుకొన్న సమస్యలపై కొంత కాలం మాత్రమే ప్రొఫెసర్ కోదండరామ్ భాజపాతో కలిసిపనిచేయడం సాధ్యం కావచ్చు.