స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె ప్రస్తుత భాజపా నేత డి.పురందేశ్వరి ఏపి సిఎం చంద్రబాబుపై పరోక్షంగా విమర్శల వర్షం కురిపించారు. “వేరే పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించడం ఒక తప్పు. పార్టీలో చేర్చుకొన్నాక వారిచేత వారి పదవులకు రాజీనామాలు చేయించకపోవడం మరో తప్పు. వేరే పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న ఆ ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చుకోవడం ఇంకా తప్పు. ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని కించపరిచే చర్యలే. ఒక పార్టీ తరపున పోటీ చేసిన వ్యక్తికి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే అతను లేదా ఆమె వేరే పార్టీలో చేరదలిస్తే ముందుగా తన పదవికి రాజీనామా చేయాలి. కానీ అలా చేయకుండా ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ మరో పార్టీకి చెందిన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడం అనైతికమే..అది తనను ఎన్నుకొన్న ప్రజలను అవమానించడమే. తెదేపా ఈవిధంగా చేయడం సబబు కాదు. నేను దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అంతే కాదు..మా పార్టీ అధిష్టానానికి కూడా దేని గురించి పిర్యాదు చేస్తూ లేఖ వ్రాశాను,” అని పురందేశ్వరి మీడియాతో అన్నారు.
దీనిపై మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పందిస్తూ ఒక అసందర్భమైన ప్రశ్న వేశారు. ఆమె ఎప్పుడైనా జగన్ అక్రమ ఆస్తుల గురించి ప్రశ్నించారా? అని అడిగారు. అంటే జగన్ అవినీతిని ప్రశ్నించనపుడు తమను ప్రశ్నించడం దేనికి? అని అడుగుతున్నట్లుంది. ఆమె లేఖపై భాజపా అధిష్టానంతో తాము కూడా మాట్లాడుతామని చెప్పారు. తమ పార్టీ మెజార్టీ లేక వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకోలేదని, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన తెదేపా సర్కార్ ను జగన్ కూలగొట్టాలనే దురాలోచన చేసినందునే జగన్ తీరుని అసహ్యించుకొని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెదేపాలో చేరిపోయారని అని మంత్రి చెప్పారు.
తెదేపా ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని తప్పు పడుతున్న పురందేశ్వరి ఇదివరకు తమ పార్టీ ఉత్తరాఖండ్, అసోంలో అదే తప్పు చేసిందనే సంగతి మరిచిపోయినట్లున్నారు. డిల్లీలో ఆమాద్మీ పార్టీ ఎమ్మెల్యేని ఈమధ్యనే భాజపాలో చేర్చుకొన్న సంగతి గుర్తులేనట్లుంది ఆమెకు. ఇక గోవా, మణిపూర్ రాష్ట్రాలలో అధికారం దక్కించుకోవడం కోసం భాజపా చేసిన ఘనకార్యాల గురించి ఆమె మరిచిపోయారు. కనుక ఈరోజుల్లో రాజకీయ నేతలు ఎవరైనా మరొకరిని వేలెత్తి చూపే పరిస్థితిలో లేరు. చూపిస్తే నాలుగు వేళ్ళు తమ వైపే చూపిస్తుంటాయని మరిచిపోకూడదు.