తమిళనాడుకు చెందిన కొందరు రైతులు తమ పంటరుణాలను కేంద్రం మాఫీ చేయాలని కోరుతూ గత 20 రోజులుగా డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. దానికి కేంద్రప్రభుత్వం స్పందించలేదు కానీ మద్రాస్ హైకోర్టు స్పందించింది. వారి సమస్యపై దాఖలైన ఒక పిటిషన్ పై స్పందిస్తూ తక్షణమే రైతులందరి పంట రుణాలు మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు ముందు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారికి మాత్రమే పంటరుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఇప్పుడు ఎంత భూమి ఉన్నప్పటికీ అందరికీ మాఫీ చేయాలనీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై రైతు సంఘాలు అనీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
అయితే ఈ తీర్పు విన్నప్పుడు న్యాయస్థానాలు ప్రభుత్వాలకి ఇటువంటి ఆదేశాలు జారీ చేయడం సమంజసమేనా?అనే సందేహం కలుగకమానదు. ఎందుకంటే దీని వలన ప్రభుత్వంపై కొన్ని వేలకోట్లు ఆర్దికభారం పడుతుంది. రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి ఇటువంటి హామీలు ఇచ్చి ఉంటే వాటిని నెరవేర్చవలసిన బాధ్యత వాటిపై ఉంటుంది కనుక అవి ఏదో విధంగా ఆ బాకీలను తీర్చవలసి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏమి చేయాలో న్యాయస్థానాలు నిర్ణయించడం అంటే అది పాలనలో జోక్యం చేసుకొన్నట్లే అవుతుంది కదా?