మంత్రివర్గ విస్తరణ అంటే తేనె తుట్టెను కదల్చడం వంటిదే. మంత్రిపదవులు ఆశిస్తున్నవారందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదు కనుక అవి దక్కనివారు పార్టీ అధినేతపై అలగడం, కొందరు రాజీనామాలకు సిద్దపడటం, అప్పుడు వారిని సీనియర్లు బుజ్జగించడం సర్వసాధారణమైన విషయమే. ప్రస్తుతం ఏపిలో అదే జరుగుతోంది.
ఈరోజు జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రిపదవులు కోల్పోయినవారు, పదవులు ఆశించి భంగపడినవారు, నిన్నగాక మొన్న వైకాపా నుంచి తెదేపా చేరినవారికి మంత్రిపదవులు ఇచ్చినందుకు పార్టీలో కొందరు సీనియర్లు అలక పాన్పులు ఎక్కారు.
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనను మంత్రివర్గంలో నుంచి తొలగించినందుకు అలిగి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ లేఖను చంద్రబాబుకు పంపారు. చిత్తూరు జిల్లాలో ఆయన అనుచరులు కొందరు తమ జెడ్.పి.టి.సి. ఎంపిపి పదులకు రాజీనామాలు చేశారు.
మంత్రి పదవి కోల్పోయిన రావెల కిషోర్ బాబు ఇంకా స్పందించలేదు. ఆయనపై వేటు పడుతుందని చాలా కాలంగానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేడు అవి నిజమయ్యాయి. అలాగే పీతల సుజాత, కిమిడి మృణాళినిల పనితీరు బాగోలేదని ముఖ్యమంత్రి చాలాసార్లు హెచ్చరిస్తునే ఉన్నారు. కానీ వారి పనితీరు మెరుగుపరుచుకోలేకపోవడంతో నేడు వారి మంత్రిపదవులు ఊడాయి. దీనిపై వారిరువురూ స్పందించలేదు.
తెదేపాలో మంచి నోరున్న నేతగా పేరుపడ్డ తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మంత్రి పదవి ఇవ్వందుకు అలిగారు. ఆయనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడి బుజ్జగించినట్లు సమాచారం. అలాగే మరో ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కూడా అలకబూనారు. ఆయనకు మంత్రి పదవి దక్కదని నిన్ననే స్పష్టం అయింది. ఆయనను కూడా పార్టీలో సీనియర్లు బుజ్జగిస్తున్నట్లు సమాచారం.