కాళేశ్వరానికి సూత్రప్రాయంగా అనుమతి

తెలంగాణా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన నిపుణుల కమిటీ కొన్ని షరతులతో అనుమతి మంజూరు చేసింది. ఆ షరతులు ఏమిటంటే:

1. దానికి కేంద్ర జలవనరుల కమీషన్ అనుమతి తీసుకోవాలి.

2. ఈ ప్రాజెక్టు క్రింద ముంపుకు గురయ్యే ప్రాంతాలలో పర్యావరణంపై ఎటువంటి ప్రభావం చూపబోతోందనే నివేదిక, ఆ నష్టాన్ని తెరాస సర్కార్ ఏవిధంగా భర్తీ చేయాలనుకొంటోందనే వివరాలతో కూడిన నివేదికను  సమర్పించాలి.

3. ఈ ప్రాజెక్టు నిర్వాసిత రైతులపై దీని ప్రభావం ఏవిధంగా ఉండబోతోందనే నివేదిక. వారికి తెరాస సర్కార్ ఇవ్వబోతున్న నష్టపరిహారం వివరాలు. 

మొదటి షరతు ఒక్కటి తప్ప మిగిలిన రెండూ తెరాస సర్కార్ చేతిలో పనే గనుక వాటిని సమర్పించడం దానికి పెద్ద కష్టమేమీ కాదు. అలాగే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో మంత్రి హరీష్ రావు ఇప్పటికే దీని గురించి మాట్లాడారు. కనుక జలవనరుల కమీషన్ కూడా అనుమతి మంజూరు చేయవచ్చు. కనుక కేంద్రం తరపున ఈ ప్రాజెక్టుకు అవరోధాలు తొలగినట్లే భావించవచ్చు. 

కానీ ఇంకా భూసేకరణ సమస్యను అధిగమించవలసి ఉంది. దానిపై ఇప్పటికే న్యాయస్థానంలో కొన్ని కేసులు దాఖలైనట్లు సమాచారం. కనుక ముందుగా వాటిని పరిష్కరించుకోవలసి ఉంటుంది. కానీ ఏ కారణాల చేత ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతున్నా దాని నిర్మాణవ్యయం క్రమంగా పెరిగిపోతుంది. అలాగే ఎన్నికలు దగ్గిరపడితే దానిపై ముందుకు సాగడం కూడా కష్టమే. కనుక తెరాస సర్కార్ ఈ ప్రాజెక్టు విషయంలో చాలా వేగంగా ముందుకు సాగవలసి ఉంటుంది.