ఓటుకు నోటు భూతం వెంటాడుతూనే ఉంది

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ మొదలై రెండేళ్ళు కావస్తున్నా ఇంకా అది తేలలేదు. ఆ కేసులో నిందితుడుగా ఉన్న తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నిన్న నామపల్లిలోని రాష్ట్ర ఏసిబి కోర్టు విచారణకు హాజరయ్యారు. కానీ దానిపై విచారణ జరుపకుండానే వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించడంతో సండ్ర తిరిగి వెళ్ళిపోయారు. 

ఈ కేసులో నిందితులను దోషులుగా నిరూపించేందుకు బలమైన ఆధారాలు ఉన్నప్పటికీ కేసు నత్తనడకన సాగుతోంది. అలాగని కేసును పూర్తిగా మూసివేయలేదు.. అక్రమాస్తుల కేసులు జగన్ నెత్తిన కత్తిలా ఏవిధంగా వ్రేలడుతున్నాయో, అదేవిధంగా ఈ ఓటుకు నోటు కేసు కూడా తెదేపా నేతల నెత్తిన కత్తిలా వ్రేలాడుతోందని చెప్పవచ్చు. ఓటుకు నోటు కేసు తెరాస చేతిలో ఒక బ్రహ్మాస్త్రం వంటిదే. బహుశః దానిని వచ్చే ఎన్నికలలో ప్రయోగించి రేవంత్ రెడ్డిని, తెదేపాను కట్టడి చేసే ప్రయత్నం చేస్తుందేమో? ఈ కేసు విచారణ ఇంకా ఎన్నేళ్ళు సాగుతుందో ఇంకా ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. అంతవరకు అది తెదేపా నేతలను భూతంలా వెంటాడుతూనే ఉంటుందని భావించవచ్చు.