కోలీవుడ్ సూపర్ స్టార్.. లక్షలాది అభిమానుల ప్రత్యక్షదైవం రజనీకాంత్ ఈనెల 2న అంటే రేపు రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానులతో రేపు ఆయన చెన్నైలో సమావేశమవుతుండటమే అందుకు కారణం.
జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడినందున ఆయన రాజకీయ ప్రవేశం చేయాలని వారు పట్టుబడుతున్నారు. వారి ఒత్తిడికి తలొగ్గి ఆయన రేపు వారితో సమావేశమయిన తరువాత దీనిపై ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి. కానీ రజనీకాంత్ ఈ పుకార్లు, ఊహాగానాలకు తెర దించుతూ నిన్న ఒక ప్రకటన చేశారు.
“నేను రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదు. నాకు అటువంటి ఆలోచన లేదు. చాలా కాలంగా నా అభిమానులు నన్ను కలవాలని తహతహలాడుతున్నారు. అందుకే వారు రేపు సమావేశం ఏర్పాటు చేసుకొన్నారు. కానీ అనివార్య కారణాల వలన నేను రేపు వారిని కలువలేను. కనుక ఈ నెల 11 నుంచి 16వరకు వారినందరినీ తప్పకుండా కలుసుకొంటాను. నా రాజకీయ ప్రవేశంపై మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని ప్రజలకు, ముఖ్యంగా నా అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని రజనీకాంత్ ప్రకటించారు.
రజనీకాంత్ ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. ఇప్పుడు ఇంత వయసులో రాజకీయాలు ప్రవేశించడం వలన ఆయనపై ఇంకా ఒత్తిడి పెరిగి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇంతవరకు అందరూ ఆయనను అభిమానిస్తున్నారు. గౌరవిస్తున్నారు. రాజకీయాలలో ప్రవేశిస్తే ఆ గౌరవాభిమానాలు, పేరు ప్రతిష్టలు అన్నీ కోల్పోవలసి రావచ్చు. ప్రస్తుతం అందరివాడిగా ఉన్న ఆయన రాజకీయాలలోకి ప్రవేశిస్తే కొందరివాడిగా మారిపోతారు. కనుకనే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని భావించవచ్చు.