జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ భాదితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “లక్షలాదిమంది ప్రజల జీవితాలను చిద్రం చేస్తున్న ఈ అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించేందుకు తెదేపా ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవడం లేదో అర్ధం కావడం లేదు. ఆ సంస్థకు వేలకోట్లు విలువగల డిపాజిట్లు, ఆస్తులు ఉన్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం భాదితులకు డబ్బు చెల్లించే ప్రయత్నం చేయలేదు. అదే...పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్న బాధితులకు అక్కడి ప్రభుత్వం రూ.5,000 చొప్పున నష్టపరిహారం చెల్లించింది. కానీ రెండున్నరేళ్ళు గడిచినా తెదేపా ప్రభుత్వం భాదితులను ఆదుకోలేదు. ఈ వ్యవహారంలో అధికార పార్టీలో వారిపైనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటినీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటువంటి ఆర్దికనేరాలను నియత్రించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ కేసు కోర్టులో ఉన్నందున నేను ఈ సమస్యపై ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. కనీసం ఇప్పటికైనా భాధితులకు న్యాయం చేయాలి. ఈ వ్యవహారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పారదర్శకంగా వ్యవహరించాలని నేను కోరుకొంటున్నాను. అగ్రిగోల్డ్ భాదితులను ఏవిధంగా ఆదుకోవాలనుకొంటోందో తెలియజేస్తూ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి,” అని అన్నారు.