ఈ కొత్త సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాలు, వాటి ప్రభుత్వాలు, నేతలు, ప్రజల పరిస్థితులు ఏవిధంగా ఉండబోతున్నాయనే విషయాలను పంచాగకర్తలు చెపుతున్నారు. మళ్ళీ వారిలో అధికార, ప్రతిపక్ష పార్టీల పంచాంగకర్తలు లెక్కలు వేర్వేరుగా ఉంటాయి.
అధికార పార్టీకి ఇక తిరుగు ఉండదని, వారి పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యసంపదలతో హాయిగా జీవిస్తారని వారి పంచాంగకర్త చెపితే, ప్రతిపక్ష పంచాంగకర్త అందుకు పూర్తి భిన్నంగా చెపుతాడు. ఆకాశంలో గ్రహాలన్నీ సడన్ గా తమ డైరెక్షన్ మార్చేసుకొని ప్రతిపక్ష నేతకు అనుకూల డైరెక్షన్ లో తిరగడం మొదలుపెట్టాయని కనుక త్వరలోనే సదరు నేతకి రాజయోగం (అధికారం) పట్టబోతోందని, వారి పాలనలో మళ్ళీ రామరాజ్యం లేదా మరో రాజ్యం ఏర్పడబోతోందని గట్టిగా బల్లగుద్ది చెప్పి అతనిని సంతోషపెట్టి దక్షిణపుచ్చుకొని తను కూడా సంతోషంగా వెళ్ళిపోతాడు. కనుక ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలందరూ సంతోషంగా ఉన్నట్లే భావించవలసి ఉంటుంది.
అయితే వర్తమాన రాజకీయ పరిస్థితులను బట్టి లెక్కలు కట్టి ఈ నూతన సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాలలలో రాజకీయ పరిస్థితులు, ప్రజలపై వాటి ప్రభావం ఏవిధంగా ఉండబోతోందని ఆలోచించవచ్చు.
తెలంగాణా రాష్ట్రంలో సుస్థిరమైన, చాల బలమైన ప్రభుత్వమే ఉంది. కనుక రాజకీయ అనిశ్చితకు తావు ఉండదని వేరే చెప్పనవసరం లేదు. ప్రతిపక్షాలు ఆరోపణలను పరిగణనలోకి తీసుకొన్నట్లయితే, కొన్ని పధకాలను తెరాస సర్కార్ ఆచరణలో పెట్టలేకపోతోందని అర్ధం అవుతోంది కనుక వాటితో ముడిపడున్న వర్గాల ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని చెప్పవచ్చు. కానీ తెరాస సర్కార్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో చాలా గట్టిగానే కృషి చేస్తోంది కనుక దాని ప్రయత్నాల వలన ఈ నూతన సంవత్సరంలో కూడా రాష్ట్రానికి ఇంకా ఎంతో కొంత మేలే జరుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక రాష్ట్రంలో ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకొంటూ వచ్చే ఎన్నికలలో విజయం సాధించడానికి గట్టి ప్రయత్నాలు చేయడం తధ్యం కనుక వాటి నుండి తెరాస సర్కార్ కు మున్ముందు గట్టి సవాళ్ళు ఎదుర్కోవలసిరావచ్చు. లేదా ప్రతిపక్షాలలో ముఖ్యనేతలే తమ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని తెరాసలోకి దూకేయవచ్చు. అప్పుడు అవి ఇంకా బలహీనపడగా, తెరాస ఇంకా బలోపేతం అవుతుంది.
ఇక పొరుగునే ఉన్న ఏపిలో కూడా తెదేపా సర్కార్ చాలా బలంగానే ఉన్నప్పటికీ దానికి జగన్మోహన్ రెడ్డి పక్కలో బల్లెంలా ఉన్నారు. జగన్ ఒక్కడే చంద్రబాబు ప్రభుత్వానికి నిత్యం ఏదో ఒక అగ్నిపరీక్షలు పెడుతూ ముప్పతిప్పలు పెడుతున్నారు. కానీ తెదేపా సర్కార్ పై ఆధారాలతో సహా జగన్ చేస్తున్న ఆరోపణలను అది చాలా తేలికగా కొట్టి పడేస్తున్నప్పటికీ, అవి ప్రజలకు బాగానే చేరుతున్నాయని చెప్పకతప్పదు. కనుక తమ ప్రభుత్వం పట్ల ప్రజలలో అసంతృప్తి పెరుగుతోందని చంద్రబాబు అంగీకరించి దాని నివారణ చర్యలు చేపట్టకపోతే వచ్చే ఎన్నికలలో నష్టపోయే ప్రమాదం ఉంది.
నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్నారు కనుక అతను ఏమైనా పొరపాట్లు చేసినట్లయితే బాబు ప్రభుత్వం కొత్త ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. కనుక ఈ ఏడాది కూడా బాబుకు మనశాంతి తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చాలా జోరుగానే సాగుతున్నాయి. అలాగే ఇప్పుడు ఏపిలో మౌలికవసతులకల్పన శరవేగంగా జరుగుతోంది. తెదేపా, భాజపాల మద్య, అలాగే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య మంచి బలమైన స్నేహసంబంధాలే ఉన్నాయి కనుక ఏపి కూడా పారిశ్రామికంగా, ఆర్ధికంగా అభివృద్ధి సాధించవచ్చు.