జనసేనలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది..ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా వాస్తవమే. ఆ పార్టీ మొట్టమొదటగా అనంతపురం నుంచే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నందున, ఆ జిల్లా, రాష్ట్ర స్థాయి సమస్యల గురించి పూర్తి అవగాహన ఉన్న రచయితలు, విశ్లేషకులకు ఆహ్వానం పలుకుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇవి ఉద్యోగాలు కావనే భావించవలసి ఉంటుంది. ఒకవిధంగా ఇది ఆ పార్టీలో సభ్యత్వం తీసుకోవడంగానో లేదా ఆ పార్టీ తరపున ప్రజాసమస్యల గురించి వ్రాయడం, ఆపార్టీ, దాని అధినేత పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ ఆలోచనలు, ఆశయాల గురించి ప్రజలకు వివరించడం వంటి బాధ్యతలు నిర్వర్తించడానికి ఇష్టపడేవారికి ఇది ఆహ్వానంగా భావించవచ్చు.
ఈరోజు జనసేన విడుదల చేసిన ప్రకటనలో అనంతపురం జిల్లావారికి మాత్రమే “వ్యాఖ్యాత, కంటెంట్ రైటర్, విశ్లేషకుల” నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రాస్థాయి నుంచి సమగ్ర స్థాయి వరకు వర్తమాన అంశాలు, సమస్యలపై మంచి అవగాహన కలిగినవారు www.janasenaparty.org/resourcepersons అనే వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసిందిగా ఆ ప్రకటనలో కోరింది. ఎంపిక చేసిన అభ్యర్ధులకు జనసేన నుంచి మెసేజ్ లేదా ఫోన్ కాల్ ద్వారా తెలియజేస్తామని ఆ ప్రకటనలో తెలిపింది. ఇది కేవలం అనంతపురం జిల్లా వాసులకు మాత్రమే పరిమితం అని స్పష్టంగా పేర్కొంది.
ఒక రాజకీయ పార్టీ ఈవిధంగా తన పని ప్రారంభించడం చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది మంచి ఆలోచనే అని చెప్పవచ్చు. పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించేసి, ఇతర పార్టీల నుంచి నేతలను కార్యకర్తలను ఆహ్వానించి వారికి పార్టీ కండువాలు కప్పేసి, పార్టీని వారి చేతిలో పెట్టేసి, అధికార పార్టీపై, తన రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శలు గుప్పిస్తూ మూస రాజకీయాలు చేయడం అందరికీ తెలిసిన సాధారణ పద్ధతి. జిల్లాలు వారిగా సమస్యలను తెలుసుకొని, వాటిలో సాధకబాధకాలను విశ్లేషించుకొని, వాటి కోసం పోరాడగల కార్యకర్తలను, నేతలను ప్రజలలో నుంచే ఎంచుకోవాలను కోవడం వినూత్న ఆలోచనగా భావించవచ్చు. ఇది మన మూస రాజకీయ పద్ధతులకు, సాంప్రదాయాలకు చాలా భిన్నంగా ఉంది కనుక కొంచెం విచిత్రంగా కనిపించవచ్చు. కానీ ఇది మంచి ఆలోచనే కనుక ఆహ్వానించవచ్చు.