శాసనసభలో నిన్న ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కర్నాటకలో రైతులకు అక్కడి ప్రభుత్వం పంటలపై బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తోందని, తెలంగాణా ప్రభుత్వం కూడా ఆవిధంగా ఇస్తే బాగుంటుందని చేసిన సూచనకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
“ఇప్పటికే మా ప్రభుత్వం రైతులకు విద్యుత్ పై సబ్సిడీ ఇస్తోంది. మీ ప్రభుత్వ హయంలో విదించిన నిబందనలు, పరిమితులను ఎత్తివేసి ఎస్సీ, ఎస్టీ, బీసిలనే భేదం చూపకుండా రైతులందరికీ సమానంగా విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నాము. అలాగే మిగిలిన విషయాలలో కూడా అదే నియమం పాటిస్తున్నాము. మీరు చెప్పిన సలహా చాలా బాగుంది. కనుక అది ఆచరణ సాధ్యమా కాదా? అనే విషయంపై అధ్యయనం చేసేందుకు మా వ్యవసాయ మంత్రి నేతృత్వంలో ఒక బృందాన్ని కర్నాటకతో సహా కొన్ని రాష్ట్రాలకు పంపిస్తాము. వివిధ రాష్ట్రాలు రైతులకు రకరకాలుగా సహాయసహకారాలు అందిస్తుంటాయి. వాటన్నిటినీ అధ్యయనం చేసి అత్యుత్తమైన విధానం రూపొందించుకొందాము. రైతులు, చేనేత కార్మికులు, కార్మికులు అన్ని వర్గాల ప్రజలు సమానంగా అభివృది సాధించాలనే మా కోరిక. అందుకోసం కొన్ని విషయాలలో మా శక్తికిమించి వారికి సహాయపడుతున్నాము. రైతుల పండించే పంటలకు బోనస్ ఇవ్వగలిగితే అంతకంటే సంతోషకరమైనది ఏముంటుంది?” అని అన్నారు.
తెరాస సర్కార్ ఇంత సానుకూలంగా స్పందిస్తునందుకు కాంగ్రెస్ సభ్యులు శాసనసభలో అధికార పార్టీని మెచ్చుకొంటూనే, మళ్ళీ బయటకు వచ్చినపుడు శాసనసభలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని తెరాస సర్కార్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ తమ గొంతు నొక్కేయాలని ప్రయత్నిస్తోందని విమర్శిస్తుండటం హాస్యాస్పదంగా ఉంటుంది.
ప్రతిపక్షాలు చేస్తున్న సూచనలను ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే పట్టించుకోవడం లేదని విమర్శిస్తాయి. కాంగ్రెస్ చేసిన సూచనలను ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్వీకరిస్తే, కాంగ్రెస్, తెరాసలు కుమ్మక్కు అయ్యాయని రేవంత్ రెడ్డి శాసనసభ బయట విమర్శిస్తుంటారు. శాసనసభలో ప్రతిపక్షాల గొంతు వినబడనీయకుండా తెరాస సర్కార్ బుల్ డోజ్ చేస్తోందని ఆరోపిస్తుంటారు. కానీ ఈ చిన్న ఉదాహరణ వారి ఆరోపణలలో నిజం లేదని నిరూపిస్తోంది.
కాంగ్రెస్ సభ్యులు తమ సుదీర్గ ప్రసంగంలో తెరాస సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ, తెరాస సభ్యులు ఎవరూ లేచి వారికి అడ్డుపడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టడి చేశారు. వారి ప్రసంగం, విమర్శలు ముగిసిన తరువాతే అధికార పార్టీ తరపున ఎవరో ఒకరు లేచి వాటికి జవాబులు చెప్పడమనే ఒక మంచి సంప్రదాయానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు.