ఇంకా పాతనోట్ల మార్పిడి?

గత ఏడాది డిశంబర్ 30వ తేదీతో దేశంలో పాత రూ.500,1,000 నోట్లు చెల్లుబాటు పూర్తిగా రద్దు అయిపోయింది. సామాన్య ప్రజలు మొదలు చిన్నా పెద్దా వ్యాపారస్తుల వరకు అందరూ తమ వద్ద ఉన్న ఆ పాత నోట్లను బ్యాంకులలో జమా చేసేశారు కనుక అవి ఇప్పుడు ఎక్కడా కనబడటం లేదు. అందరూ కొత్త రూ.500, 2,000 నోట్లతోనే లావాదేవీలు నిర్వహించుకొంటున్నారు. కానీ బారీగా నల్లధనం పోగేసుకొన్నవారు డిశంబర్ 30 గడువులోగా వివిధ మార్గాల ద్వారా దానిలో చాలా వరకు మార్చుకొన్నప్పటికీ కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ విదించిన కటినమైన నిబంధనల వలన తమ వద్ద మిగిలిపోయిన పాతనోట్లను మార్చుకోలేకపోయుండవచ్చు. బహుశః అటువంటివారి కోసమే హైదరాబాద్ నగరంలో ఒక ముఠా పనిచేస్తున్నట్లుంది. 

బషీర్ బాగ్ లోని కోర్టు బిల్డింగులో జైన్ అసోసియేట్, మాస్ ఇట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు సంస్థల ముసుగులో కొందరు పాతనోట్లను మార్పిడి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వారు నిన్న దాడులు చేసి రూ.12 కోట్లు విలువగల పాతనోట్లను, ఈ ముఠా నిర్వాహకుడు ఫజలుద్దీన్ తో సహా ఈ నోట్ల మార్పిడి ముఠాలో మరికొంత మందిని అరెస్ట్ చేశారు.  

పాత నోట్లను మార్కెట్లో ఇప్పుడు మార్చడం సాధ్యం కాదు కనుక వేరే ఇతర మార్గాలలో మార్చుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పుడు బ్యాంకులు కూడా పాత నోట్లను స్వీకరించడం లేదు కనుక అక్కడా అక్రమాలు జరిగే అవకాశాలు లేవు. కనుక ఈ ముఠా ఏవిధంగా అంత బారీ స్థాయిలో పాతనోట్లను మార్చగలుగుతోంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.