త్వరలో మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు

నిన్నటితో రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. ఈ సమావేశాలలోనే మైనార్టీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని తెరాస సర్కార్ భావించినప్పటికీ కొన్ని అనివార్యకారణాల వలన కుదరలేదు. కనుక మళ్ళీ త్వరలోనే దీని  కోసం ప్రత్యేకంగా ఐదారు రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహించి బిల్లుపై చర్చించి ఆమోదింపజేయాలని తెరాస సర్కార్ భావిస్తోంది. బహుశః వారంలోగానే మళ్ళీ సమావేశాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న శాసనసభలో ప్రకటించారు కూడా.

మైనార్టీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్ శాతం పెంచినట్లయితే, అన్ని వర్గాలకు కలిపి ఇస్తున్న రిజర్వేషన్లు 62 శాతానికి పెరుగుతుంది. అది రాజ్యాంగ విరుద్దం అవుతుంది కనుక న్యాయవ్యవస్థలు అందుకు అభ్యంతరం చెప్పవచ్చు. కానీ తమిళనాడులో ప్రత్యేక చట్టం ద్వారా అన్ని వర్గాలకు కలిపి 64శాతం రిజర్వేషన్లు ఇస్తున్నందున తెలంగాణాకు కూడా అటువంటి వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

అయితే మతపరమైన రిజర్వేషన్లను రాష్ట్ర భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అది కేంద్రం వైఖరికి అద్దం పడుతోందని భావించవచ్చు. తెరాస సర్కార్ ఈ బిల్లు ప్రస్తావన చేసిన వెంటనే, అంతవరకు దానితో సఖ్యతగా ఉన్న రాష్ట్ర భాజపా నేతలు దానిపై యుద్ధం ప్రకటించడమే అందుకు చక్కటి ఉదాహరణ.  పైగా యూపిలో భాజపా విజయం సాధించిన తరువాత అది హిందూ అతివాదిగా పేరుపడ్డ ఆదిత్యనాథ్ యోగిని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా భాజపా మళ్ళీ హిందూ అతివాదంవైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపద్యంలో తెరాస సర్కార్ చేస్తున్న ఈ ప్రతిపాదనను మోడీ ప్రభుత్వం అంగీకరిస్తుందనుకోలేము. అమలుకావడం దాదాపు అసంభవంగానే కనబడుతోంది కనుక ఇది తెరాస, భాజపాలకు ఎంతో కొంత రాజకీయ మైలేజ్ పొందడానికే ఎక్కువ ఉపయోగపడవచ్చు.