సోనియా గాంధీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నంత కాలం ఆ పార్టీ సంస్థాగత ఎన్నికలు సకాలంలోనే జరిగేవి...సహజంగానే ఆమెనే అధ్యక్షురాలిగా ఎన్నుకొంటూ ఉండేవారు. కానీ 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి తరువాత రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలనుకోవడం, పార్టీలో సీనియర్ నేతలే ఆయన నాయకత్వ లక్షణాలను ప్రశ్నించడం, అయన పార్టీపై అలిగి కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకు ‘శలవు పెట్టి’ విదేశాలకు వెళ్ళిపోవడం వంటి సంఘటనలు జరిగాయి.
ఆ తరువాత ఆయన ఎప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టాలనుకొన్నా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు రావడం, వాటిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ అప్రదిష్ట తన ముద్దుల కొడుకుకు చుట్టుకొనే ప్రమాదం ఉంటుందనే భయంతో అతనికి పార్టీ పగ్గాలు అప్పగించకుండా నేటికీ సోనియా గాంధీయే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
కోడిపెట్ట తన పిల్లలను రెక్కల క్రింద దాచుకొని కాపాడుకొంటున్నట్లుగా రాహుల్ గాంధీపై మచ్చలు పడకుండా ఆమె ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నప్పటికీ, కాంగ్రెస్ వరుస అపజయాల కారణంగా ఆయన తీరని అప్రదిష్ట మూటగట్టుకొంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం కూడా అంత బాగోకపోవడంతో పార్టీ వ్యవహారాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కనుక ఇప్పుడైనా రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు చేపడతారనుకొంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఎదురుదెబ్బ తగలడంతో వెనుకంజ వేయవలసివస్తోంది. ఒక్క పంజాబ్ తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాలను భాజపా చేజిక్కించుకోవడంతో రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలపై మళ్ళీ పార్టీలో చర్చ మొదలైంది.
ఈనేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ సాంకేతిక కారణాలను సాకుగా చూపి సంస్థాగత ఎన్నికలను నిర్వహించడానికి మరొక ఆరు నెలలు గడువు కావాలని ఎన్నికల కమీషన్ ను కోరడం, అందుకు అది అంగీకరించడం చూసినట్లయితే రాహుల్ గాంధీ ఇప్పట్లో పార్టీ పగ్గాలు చేపట్టడం సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. కానీ ఆరు నెలలు ఆగినా మళ్ళీ ఇదే సమస్య ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే అప్పుడు గుజరాత్ శాసనసభ ఎన్నికలు దగ్గరపడతాయి. వాటి తరువాత కర్ణాటక ఎన్నికలు వస్తాయి. ఆ తరువాత 2019లో సార్వత్రిక ఎన్నికలు వచ్చేస్తాయి. కనుక రాహుల్ గాంధీ ఎన్నికలను చూసి పార్టీ పగ్గాలు చేపట్టడానికి భయపడితే తన జీవితంలో ఎన్నడూ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా కాలేరు. ఇక దేశనికి ప్రధానమంత్రి ఎప్పుడు అవుతారు?