ఏపిలో చంద్రబాబు నాయుడుని బలంగా డ్డీ కొంటున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆయనపై పైచెయ్యి సాధించలేకపోతున్నట్లు కనిపిస్తోంది. జగన్ చాలా బలమైన అంశాలను లేదా ప్రజా సమస్యలను ఎంచుకొని పోరాడుతున్నప్పటికీ, విపరీతమైన ఆవేశం, దుందుడుకుతనం వలన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నంలో స్వయంగా తను, తన పార్టీ తెదేపా చేతిలో చిక్కుకొని విలవిలలాడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
తెదేపా ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మొన్న రవాణాశాఖ కమీషనర్ బాల సుబ్రహ్మణ్యంను బహిరంగంగా దూషించడమే గాకుండా అయన గన్ మెన్ పై చెయ్యి చేసుకొన్నారు. ఈ సంఘటనను వైకాపా, సాక్షి బాగానే అందిపుచ్చుకొని వారిద్దరినీ, తెదేపా సర్కార్ ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టగలిగింది. కానీ చంద్రబాబు చాలా చురుకుగా వ్యవహరించి, వారిరువురి చేత కమీషనర్ కు, ఉద్యోగులకు క్షమాపణలు చెప్పించి అధికారులను, ఉద్యోగులను కట్టడి చేశారు.
ఆ ప్రయత్నం విఫలం అవడంతో వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని నేడు సచివాలయం ముందు దీక్షకు కూర్చోబెట్టారు జగన్. కానీ మంగళగిరి పోలీసులు వచ్చి ఆయనను అరెస్ట్ చేసి తీసుకుపోయారు. వైకాపా ఎమ్మెల్యేలు అతనిని కలుసుకొనేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసులు వారిని లోపలకి అనుమతించకపోవడంతో నిస్సహాయంగా ఆక్రోశం వెళ్లగక్కారు.
నిజానికి ఈ రెండు వ్యవహారాలలో తెదేపాను జగన్ బాగానే పట్టుకొన్నప్పటికీ సరైన వ్యూహం అమలుచేయలేకపోవడం వలన తను, తన ఎమ్మెల్యేలే చాలా ఇబ్బందిపడవలసి వచ్చింది. తమ ఎమ్మెల్యేల పట్ల మంగళగిరి డి.ఎస్.పి., సి.ఐ.లు అనుచితంగా వ్యవహరించినందుకు వారిపై రేపు సభా హక్కుల నోటీసు ఇవ్వాలని వైకాపా నిర్ణయించుకొంది.
తెదేపా నేతలు ప్రభుత్వోద్యోగులపట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నేడు ధర్నా చేసిన వైకాపా, ముగ్గురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రేపు నోటీసులు ఇవ్వాలనుకోవడం చాలా విచిత్రం..అది మరో పొరపాటు నిర్ణయమని చెప్పకతప్పదు.
రేపు శాసనసభలో ఈ నోటీస్ ఇచ్చిన వెంటనే తెదేపా నేతలు అడిగే మొట్టమొదటి ప్రశ్న..విశాఖ విమానాశ్రయంలో పోలీస్ అధికారులను జగన్ బెదిరించింది వాస్తవమా కాదా? గుంటూరు జిల్లా కలెక్టరును సెంట్రల్ జైలుకు పంపిస్తానని బెదిరించింది వాస్తవమా కాదా? అని! ఇప్పుడు ఈ ముగ్గురు పోలీస్ అధికారులను ఈరూపంలో బెదిరిస్తున్నారని ఎదురుదాడి చేయకమానరు. జగన్ అధికారంలో లేనప్పుడే పోలీసులపై, కలెక్టర్లపై ఇంత దురుసుగా వ్యవహరిస్తుంటే ఇక అధికారంలోకి వస్తే ఏవిధంగా వ్యవహరిస్తారో అని అక్షేపించాకుండా ఉండరు.
ఈవిధంగా జగన్ అనాలోచిత, ఆవేశపూరిత నిర్ణయాలవలన తను స్వయంగా చిక్కులో పడుతుండటమే కాకుండా వైకాపా ఎమ్మెల్యేలకు కూడా ఇబ్బందులు సృష్టిస్తున్నారని చెప్పక తప్పదు. జగన్ యొక్క ఈ బలహీనతను తెదేపా బాగానే గుర్తించి తెలివిగా దానిని ఉపయోగించుకొంటూ జగన్ విసురుతున్న సవాళ్ళ నుంచి అలవోకగా తప్పించుకోగలుగుతోందని చెప్పక తప్పదు.