మహారాష్ట్రలో శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్, ఎయిర్ ఇండియా ఉన్నతాధికారిని చెప్పుతో కొట్టిన తరువాత అందుకు ఏమాత్రం పశ్చాతాపడకపోగా మీడియాతో మాట్లాడుతూ “నేను భాజపా ఎంపిని కాను..శివసేన ఎంపిని,” అని అన్నారు. తనను విమానంలో ప్రయాణించేందుకు అనుమతించకూడదని విమానయాన సంస్థలు నిర్ణయించుకొన్నప్పుడైనా అయన ఆ అధికారికి క్షమాపణలు చెప్పి ఈ వివాదాన్ని ముగించి ఉండి ఉంటే బాగుండేది. కానీ వాటిని కోర్టుకు ఈడుస్తానని హెచ్చరిస్తున్నారు.
అతనికి శివసేన అధినేత ఉద్దవ్ టాక్రే సంజాయిషీ కోరడంతో అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటారని అందరూ భావించారు. కానీ అతనిపై విమానయాన సంస్థలు నిషేధం విధించినందుకు నిరసనగా మహారాష్ట్రలోని అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉస్మానాబాద్ లో సోమవారం శివసేన బంద్ కు పిలుపునివ్వడం విస్మయం కలిగిస్తుంది. అంతే కాదు..పార్లమెంటులో దీనిపై ఒక ప్రివిలేజ్ నోటీస్ కూడా ఇవ్వడానికి శివసేన పార్టీ సిద్దం అవుతోంది.
ఎంపి వంటి బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న రవీంద్ర గైక్వాడ్ ఆవిధంగా వ్యవహరించడమే పెద్దతప్పు. అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటే ప్రజల దృష్టిలో తమ పార్టీ చులకన అవుతుందనే ఆలోచనతో అతనికి మద్దతుగా నేడు శివసేన ఉస్మానాబాద్ లో బంద్ నిర్వహించడం మరో తప్పు. దానితో ఆ నియోజకవర్గపు ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం మరో తప్పు. ఇన్ని తప్పులు చేసి మళ్ళీ పార్లమెంటులో దీనిపై ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వాలనుకోవడం అన్నిటికంటే పెద్ద తప్పు. ఒక తప్పును సరిదిద్దుకోవలసింది పోయి వరుసగా తప్పులు చేయడం సిగ్గుచేటు. వీటితో శివసేన పార్టీ తన నైజం మరోమారు నిరూపించుకొన్నట్లయింది.