నేటి నుంచి మార్చి 29వరకు గద్వాల సంబరాలు జరుగుతాయి. గద్వాల చేనేత కార్మికులను, ఇతర కళాకారులను ప్రోత్సహించేందుకు గద్వాల మార్కెట్ యార్డు సమీపంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ లో వారి కోసం అధికారులు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ నాలుగు రోజులు సాయంత్రం పూట కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయని జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ తెలిపారు. ఈ ఉత్సవాలలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి వివిద కళాకారులు వచ్చి ప్రదర్శనలు ఇస్తారని తెలిపారు.
నిజామాబాద్ ఎంపి కవిత ఈరోజు సాయంత్రం ఈ గద్వాల ఉత్సవాలను ప్రారంభించబోతున్నారు. ఈరోజు సాయంత్రం జరుగబోయే కార్యక్రమానికి అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతలకి, ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాలు పంపించారు. జిల్లాల పునర్విభజన తరువాత జిల్లా హోదా పొందిన జోగులాంబ గద్వాల జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి జిల్లా అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల గురించి జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేసినందున ప్రజలు కూడా బారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది కనుక అందుకు తగ్గట్లుగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.