తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున శ్రవణ్ కుమార్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఉపాద్యాయ ఉద్యోగాల భర్తీ విషయంలో ఆలస్యం చేస్తున్నందుకు తెరాస సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణాలో సుమారు 16,000 ఉపాద్యాయపోస్టులు ఖాళీ ఉండగా తెరాస సర్కార్ ఇంతవరకు వాటిని భర్తీ చేయకపోవడం వలన విద్యార్ధులు నష్టపోతున్నారని శ్రవణ్ కుమార్ వాదించారు. తెరాస సర్కార్ తరపున వాదించిన న్యాయవాది రాష్ట్ర ప్రభుత్వం 8,700 పోస్టుల భర్తీ చేయడానికి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ కు ఆదేశాలు జారీ చేసిందని మరొక 6 నెలలలో భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని కోర్టుకు తెలియజేశారు. కానీ అంత సమయం తీసుకొంటే ఈ విద్యాసంవత్సరంలో సగం రోజులు గడిచిపోతాయనే పిటిషనర్ వాదనతో ఏకీభవించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ మదన్ బి లోకూర్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం 3 నెలలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.
ఇక ఏపిలో 1,140 ప్రభుత్వ పాఠశాలలలో మరుగుదొడ్లు, మంచి నీళ్ళువంటి కనీస సౌకర్యాలు లేవని అమికాస్ క్యూరీ గుప్తా కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన సుప్రీం ధర్మాసనం దానిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపి సర్కార్ ను ఆదేశించింది.