పాపం మూగజీవులు..

యూపిలో జంతు ప్రదర్శనశాలలో మాంసాహారం మాత్రమే తినే జంతువుల పరిస్థితి చూస్తుంటే “తినమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం” అనే సామెత గుర్తుకు రాక మానదు. గోవధను తీవ్రంగా వ్యతిరేకించే ఆదిత్యనాథ్ యోగి యూపి ముఖ్యమంత్రి అవగానే రాష్ట్రంలో అనుమతిలేని కబేళాలను, గోవధశాలలను మూసివేయించిన సంగతి తెలిసిందే.

ఆ నిర్ణయం వలన వేలాది ఆవులు, ఎద్దులు, ఇతర పెద్ద జంతువుల ప్రాణాలు కాపడబడినమాట నిజమే. కానీ గొడ్డు మాంసం తప్ప మరేది ముట్టని పులులు సింహాలకు ఆదిత్యనాథ్ యోగి నిర్ణయంతో తిండికి కరువైపోయి ఆకలితో నకనకలాడుతున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పెద్ద పులులు, సింహాలు వంటి పెద్ద జంతువులకు రోజులు సమారు 200-300 కేజీల ఆవు లేదా ఎద్దు మాంసం ఆహారంగా ఇస్తుంటారు. కానీ ఇప్పుడు గోవధ నిషేదించడంతో వాటికి కోళ్ళు, మేకల మాంసం పెడుతుంటే అవి దానిని ముట్టడం లేదని జూ అధికారులు చెపుతున్నారు. ఇక నక్కలు, తోడేళ్ళు, అడవి కుక్కలు వంటి ఇతర చిన్న జంతువులు కూడా ఈ కొత్త ఆహారానికి అలవాటు పడలేక చాలా ఇబ్బంది పడుతున్నాయని జూ అధికారులు చెపుతున్నారు. 

ముఖ్యమంత్రి యోగి నిర్ణయం వలన అనేక రాష్ట్రంలో అనేక మటన్ షాపులు, మాంసాహార హోటల్స్ మూతపడుతునట్లు, ఆ కారణంగా వాటిలో పనిచేస్తున్న అనేకమంది రోడ్డున పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మనుషులు ఇటువంటి సమస్యలను ఏదో విధంగా పరిష్కరించుకోగలరేమో కానీ మనుషుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి జీవిస్తున్న జూలోని నోరులేని జీవుల క్షుద్బాధను ఎవరు తీర్చగలరు?ఈ సమస్య గురించి సంబంధిత శాఖ అధికారులు జంతుప్రేమికుడైన ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి దృష్టికి తీసుకువెళ్ళారు. ఆయన దీనిపై తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంది. గోవధకు ఆయన ఎంత మాత్రం అంగీకరించరు కనుక బహుశః వాటన్నిటినీ అడవులలో విడిచిపెట్టేయమని ఆదేశిస్తారేమో?